ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తత్వం బోధపడినట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే ఒకప్పుడు ఆయన చంద్రబాబు నాయుడుని పెద్దగా పట్టించుకోలేదు. అంతేకాదు ఆయనకి ఎన్నికలకు ముందు కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా మానసికంగా ఇబ్బంది పెట్టారు. అయితే ఎన్నికల్లో అతి కష్టం మీద పొత్తు పెట్టుకున్న బిజెపి.. ఏకంగా నాలుగు ఎంపీ స్థానాలు, ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో విజయం దక్కించుకుంది. దీంట్లో చంద్రబాబు విలువేంటో మోడీకి , అదే విధంగా బిజెపికి బాగా తెలిసింది. దీంతో ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చంద్రబాబుకు విలువ ఇవ్వడం ప్రారంభించారు.
ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా నిర్వహించిన నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబుకు 22 నిమిషాల పాటు మాట్లాడే అవకాశం ఇవ్వడంతో పాటు ఆయన సూచనలు సలహాలను పదేపదే పేర్కొన్నారు. చంద్రబాబు వంటి దర్శనిక నాయకుడు దేశానికి అవసరమని తాజాగా పేర్కొనడం మరో విషయం. దీని వెనక వ్యూహం చూస్తే ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న కూటమి పార్టీల వ్యవహారం మోడీకి నచ్చటం లేదు. ముఖ్యంగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎప్పుడు ఎలా ఉంటారనేది చెప్పడం కష్టంగా మారింది. అదేవిధంగా ఇతర మిత్ర పక్షాలు కూడా మోడీకి ఎప్పుడు హ్యాండిస్తాయో తెలియని ఒక సంక్లిష్టత కొనసాగుతోంది.
ఈ క్రమంలో చంద్రబాబు లాంటి బలమైన విశ్వసనీయ మిత్రుడు తనకు అవసరమని మోడీ భావిస్తున్నట్టుగా కనిపిస్తుంది. తాజా బడ్జెట్లో ఏపీకి పెద్దగా కేటాయింపులు లేకపోయినా అమరావతికి అప్పు ఇప్పిస్తామని, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకు సహకరిస్తామని మాత్రమే చెప్పినా.. చంద్రబాబు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, అదే విధంగా బడ్జెట్ను కూడా ఆకాశానికి ఎత్తేశారు. ఇదే సమయంలో బీహార్లో మిత్ర పక్షంగా ఉన్న జేడీయు నేతలు మాత్రం మోడీని తిట్టిపోశారు. తమ కోరిక ఒకటి కూడా నెరవేర్చలేదని, తమకు ప్రత్యేక హోదా ఇవ్వలేదని తాను అడిగింది ఒకటైతే చేసింది మరొకటి అని విమర్శించారు.
ఈ క్రమంలో వారు కూటమిలో ఉంటారో ఉండరో అనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఇప్పటికిప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి చంద్రబాబు వంటి బలమైన నాయకుడు అవసరం ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆయన తాజాగా జరిగిన నీతి ఆయోగ్ సమావేశాల్లో చంద్రబాబుకు పెద్దపీట వేశారు. దీనిని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తప్పుపట్టారు. చంద్రబాబు 22 నిమిషాలకు ఇచ్చి మాకు ఐదు నిమిషాలు కూడా ఇవ్వరా అని ఆమె ప్రశ్నించారు. అయినా కూడా ప్రధాని చంద్రబాబుకే మద్దతు పలికారు.
మొత్తంగా ఈ పరిణామాలను గమనిస్తే మోడీకి ఇప్పుడు తత్వం బోధపడినట్టే అని పరిశీలకులు భావిస్తున్నారు. ఎవరు తనవారు ఎవరు కాదు అనేది తెలిసిందని చెబుతున్నారు. చంద్రబాబు గౌరవాన్ని ఆయన నిలబెట్టే అవకాశం ఉందని ముందు రోజుల్లో ఏపీకే మంచి జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.