ఎమ్మెల్సీ తలనొప్పి
కారు.. ఓవర్ లోడ్
6 ఎమ్మెల్సీ స్థానాలకై 50మందికి పైగా
ఇదే..”నా “…జాబితా.!
సా(కారు)లో కలవరింత
టికెట్ ఇస్తే ఓకే.. లేకుంటే టాటా
కమలం, హస్తం టచ్ లోకి!
పలువురు మాజీలు ఖరారు.?
గతంలో అందరూ కారు ఎక్కేశారనే ఆనందం. అది ఇప్పుడు భారంగా మారింది. తెరాస అధిష్టానంతో అమీతుమీ కొందరు సిద్దం. ఇంకా ‘ఖాళీ’గా ఎన్ని రోజులనే భావన వారిలో ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉన్న సీట్లు 6. పోటీ పడే ఆశావహులు 50 మందికి పైగా ఉన్నారు. ఇందులో కొందరు ఇతర పార్టీలలో ‘కోవర్ట్ ఆపరేషన్’ చేసి వచ్చిన వారు ఉండటం గమనార్హం. ఈ మధ్యలో కులాల ‘ఈక్వేషన్’ కూడా ఉండటంతో నిశ్శబ్దంగా జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలు.. తెరాసలో అంతర్యుద్ధం జరగనున్నట్లు తెలుస్తోంది.
కాసుకొని కూర్చొని..:
ఆకులలలిత, మహ్మద్ ఫరీదుద్దీన్, గుత్తా సుఖేందర్ రెడ్డి,నేతి విద్యాసాగర్, బోడకుంట్ల వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరిలఎమ్మెల్సీ పదవీకాలం జూన్3న ముగిసింది. వీరంతా మళ్ళీ ఎమ్మెల్సీలు కావాలని ఆశపడుతున్నారు.
ఉమ్మడి జిల్లాల వారీగా ఆశావహులు వీరే..:
ఆదిలాబాద్ నుంచి ఇద్దరు, వరంగల్ 8మంది, నల్గొండ 8మంది, కరీంనగర్ 7గురు, ఖమ్మం నుంచి ముగ్గురు, నిజామాబాద్ 4గురు, మెదక్ 4గురు, హైదరాబాద్ 5గురు, రంగారెడ్డి 5గురు, మహబూబ్ నగర్ 4గురు ఆశావహులు క్యూలో ఉన్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా:
మాజీ ఎంపీ గోడం నగేశ్, అరిగెల నాగేశ్వర్రావులు పోటీ పడుతున్నారు.
హైదరాబాద్ నుంచి:
మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ సలీం, బండి రమేశ్, పీఎల్ శ్రీనివాస్ పోటిపడుతున్నారు. ఈ సారి హైదరాబాద్ కు చెందిన నేతలకు అవకాశం ఇవ్వాల్సిందేనని గట్టి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే పీ.ఎల్.శ్రీనివాస్ ఇవ్వకుంటే.. కాంగ్రెస్ లోకి వెళతానని బహిరంగంగానే చెప్తున్నట్టు సమాచారం.
ఉమ్మడి రంగారెడ్డి:
క్యామ మల్లేశ్,మర్రి రాజశేఖర్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి,కొత్త మనోహర్ రెడ్డి,పోరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి లు ఎదురు చూస్తున్నారు.
ఉమ్మడి కరీంనగర్:
హుజురాబాద్ ఎన్నికల కోసం తీర్ధం పుచ్చుకున్న టీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్.రమణ, మాజీ మంత్రి ఇ.పెద్దిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్, పార్టీ ప్రధాన కార్యదర్శి రావుల శ్రావణ్ కుమార్ రెడ్డి, తెరాస లెజిస్లేచర్ పార్టీ కార్యదర్శి మాదాడి రమేశ్ రెడ్డి, పిట్టల రవీందర్ ల మధ్య గత ఏళ్లుగా పోటీ నెలకొంది. ఎల్. రమణకు ఈ సారి ఇవ్వకుంటే అసంతృప్తితో రగిలిపోతారని తెలుస్తుంది. రావుల శ్రావణ్, రమేష్ లు కేసియార్ కి అత్యంత సన్నిహితంగా ఉండటంతో వారికి మరోసారి ఛాన్స్ వచ్చే అవకాశం కొట్టిపడేయలేం.
ఉమ్మడి నల్గోండ:
గుత్తా సుఖేందర్ రెడ్డి, నేతి విద్యాసాగర్ లున్నారు. ఇటీవల పార్టీలో చేరిన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, సాగర్ ఉప ఎన్నిక టైంలో హామీ పొందిన ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నెప్రభాకర్, పార్టీ నాయకులు శశిధర్ రెడ్డి, కర్నాటి విద్యాసాగర్, చాడ కిషన్ రెడ్డిలు. కోటిరెడ్డికి ఇచ్చిన మాట నిలబట్టుకోకపోతే.. మరోసారి పార్టీ మారాల్సి వస్తుందని సన్నిహితులతో వాఖ్యానించారని తెలుస్తుంది. కర్నె ప్రభాకర్ తనకు అన్యాయం జరుగుతుందని గగ్గోలు పెడుతున్నారు. మోత్కుపల్లి నర్సింహులుకి ‘దళితబంధు’ చైర్మైన్ గా బాధ్యతలు అప్పగించే అవకాశం కూడా ఉంది.
ఉమ్మడి ఖమ్మంజిల్లా:
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు చాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ జిల్లా నుంచి మరో ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు తమకు ఏదో ఒక పదవి ఇప్పించాలని కోరుతున్నారు. తుమ్మల ఇటీవల ఇతర పార్టీ నేతల మీటింగ్ లో పాల్గోన్నారని అధిష్టానం వద్ద సమాచారం ఉంది. పొంగులేటికి ఇప్పటికే అలస్యం అయినట్లు ఆయన అభిమానులు వత్తిడి చేస్తున్నారు.
ఉమ్మడి నిజామాబాద్:
ఆకుల లలిత తనకు మరోసారి ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు. కానీ ఆమె కోరిక తీరే అవకాశం కనిపించడం లేదు. మండవ వెంకటేశ్వర్రావు, అరికెల నర్సిరెడ్డి, రాజారాం యాదవ్ లు పోటీ పడుతున్నారు
ఉమ్మడి మెదక్ జిల్లా:
ఫరీదుద్దీన్, దేశపతి శ్రీనివాస్, గ్యాదరి బాలమల్లు, మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అవకాశం కోసం ప్రయత్నిస్తున్నారు. దేశపతికి గవర్నర్ కోటాలోనే ఇస్తామని ఊరించడం.. ఇప్పుడు తప్పకుండా వస్తుందని ఆయన ఆరాట పడుతున్నారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా:
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, షాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, శివకుమార్, జనార్దన్ లు ఉన్నారు. అయితే వెంకటేశ్వర్ రెడ్డికి టీఆర్ఎల్పీ మీటింగ్ లో పిలిచి చెవిలోఎదో ‘హామీ’ ఇచ్చారు. దీంతో తాను ఎమ్మెల్సీ ఖాయం అంటున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా:
కడియం శ్రీహరి, మధుసూదనాచారి, మాజీ ఎంపీ సీతారాం నాయక్, తక్కళ్లపల్లి రవీందర్రావు, ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి, ఎర్రబెల్లి ప్రదీప్ రావు, నూకల నరేశ్ రెడ్డి అవకాశం ఎదురు చూస్తున్నారు. ఇటీవల వరంగల్ పర్యటనకు వెళ్లినప్పుడు కేసియార్ కడియం ఇంట్లోనే భోజనం చేశారు. ఇతనికి రిన్యూవల్ ఉంటుందని అంటున్నారు. లేదంటే ప్రత్యామ్నాయం చూసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే జిల్లా నుంచి బోడకుంట్ల వెంకటేశ్వర్లు కు పదవీకాలం పూర్తియింది. ఈయనకు ఆవకాశం లేదని తెలుస్తోంది.
కౌశిక్ రెడ్డి ఖేల్ ఖతం..!:
హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల ముందు గవర్నర్ కోటాలో కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి కోసం కేసీఆర్ సర్కార్ సిఫారసు చేసింది. గవర్నర్ ఆ ఫైల్ పెండింగ్ లో పెట్టారు. పాపం కౌశిక్ రెడ్డి పరిస్థితి త్రిశంకు స్వర్గంలో ఉంది.
కులాల కుంపటి:
కులాల వారిగా లెక్కలు వేసుకుంటు అశల పల్లకిలో నేతలు. బి.సి.ల నుంచి అధిక డిమాండ్ ఉంది. గతంలో కేసియార్ అదే రెంజ్ లో హామిలు ఇచ్చారు. పద్మశాలి, కుమ్మరులకు కచ్చితంగా చోటు కల్పిస్తామని బల్లగుద్ది మరీ చెప్పారు. విశ్వబ్రాహ్మణులు, మున్నూరు కాపులు ఛాన్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. మొత్తం ఆరు సీట్లలో రెండు సీట్లు రెడ్డి కులానికి, రెండు బీసీలకు, ఒకటి ఎస్సీలకు ఇచ్చే అవకాశాలున్నాయి. ఖాళీ అయ్యే స్థానాల్లో మైనార్టీ కూడా ఉండటంతో ఆ వర్గం నుంచి ఒకరికి అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. అది హైదరాబాద్ కు చెందిన ముస్లిం వ్యక్తికి ఇస్తున్నట్లు సమాచారం. గవర్నర్ కోటాలో ఒక స్థానం కలుపుకుంటే మొత్తం ఏడు సీట్లలో రెండు రెడ్డి కులానికి, మూడు బీసీలకు, ఎస్సీ, మైనార్టీలకు ఒక్కొక్క సీటు ఇచ్చే అవకాశమున్నట్టు తెలుస్తోంది.
అసంతృప్తి..:
ఈ ఓవర్ లోడ్ తో చాలా మంది అసంతృప్తిగా ఉన్నారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు తెగించేందుకు సిద్దమవుతున్నారు. ప్రస్తుతం టీ.ఆర్.ఎస్.పై వస్తున్న వ్యతిరేకతను అంచనాలు వేస్తున్నారు. ఎన్నాళ్ల పాటు వేచి చూడాలని అసహానానికి గురవుతున్నారు. దీంతో ఏ క్షణమయినా.. పార్టీలు మారేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తుంది.
పరిశోధన పాత్రికేయులు== అనం చిన్ని వెంకటేశ్వరరావు