మంగళగిరి ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేతగా పేరున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుతో పాటు పలు కేసులలో పిల్ దాఖలు చేసిన ఆర్కే వైసీపీని వీడబోతున్నారని చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారానికి తగ్గట్లుగానే పార్టీ అధికారిక కార్యక్రమాలలో, గడపగడపకు కార్యక్రమంలో, సామాజిక బస్సు యాత్రలోగాని ఆర్కే పాల్గొనలేదు. దీంతో, వైసీపీ పెద్దలతో ఆర్కేకు చెడిందని, త్వరలోనే ఆయన వైసీపీకి రాజీనామా చేయబోతున్నారని జరుగుతున్న ప్రచారానికి ఊతం లభించినట్లయింది.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఆర్కే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు, స్పీకర్ ఫార్మేట్ లో తన రాజీనామాను ఏపీ శాసనసభ కార్యదర్శికి ఆర్కే స్వయంగా అందజేశారు. అయితే, రాజీనామాకు గల కారణాలను ఆర్కే ప్రస్తావించలేదు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నానని ఆర్కే చెప్పారు. ఎన్నికలకు మరో మూడు నెలల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ఆర్కే రాజీనామా వైసీపీ వర్గాలలో కలకలం రేపింది.
ఓవైపు సీఎం జగన్ బంధువు, వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ గా ఉన్న సమయంలోనే ఆర్కే కూడా వైసీపీకి షాక్ ఇవ్వడంతో జగన్ తోపాటు సజ్జల వంటి పార్టీ పెద్దలు అయోమయానికి గురైనట్టుగా తెలుస్తోంది. ఇక, వైఎస్ షర్మిలతో కలిసి ఏపీ కాంగ్రెస్ లో చేరేందుకు ఆర్కే రెడీ అవుతున్నారని తెలుస్తోంది. మరోవైపు, మంగళగిరి నియోజకవర్గానికి నిధులు మంజూరు కావడం లేదన్న అసంతృప్తితోనే ఆర్కే రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది. ఆ నియోజకవర్గానికి 1250 కోట్ల రూపాయల నిధులు మందులు చేస్తానని గతంలో జగన్ హామీ ఇచ్చారు.
అయితే, నిధులు విడుదల కాకపోవడంతో ఆర్కే గుర్రుగా ఉన్నారని, ఆల్రెడీ పనులు చేసిన కాంట్రాక్టర్లకు కూడా బిల్లులు రాకపోవడంతో పార్టీపై అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. దాంతోపాటు టిడిపి నుంచి వచ్చిన గంజి చిరంజీవికి నియోజకవర్గంలో ప్రాధాన్యత ఇవ్వడాన్ని కూడా ఆర్కే జీర్ణించుకోలేకపోతున్నారని తెలుస్తుంది. ఆప్కో చైర్మన్ పదవిని చిరంజీవికి జగన్ ఇవ్వడంతో ఆయన అసహనానికి గురి అయినట్టుగా తెలుస్తోంది. తనకు మంత్రి పదవి దక్కకపోయినప్పటికీ చిరంజీవికి కేబినెట్ హోదా ఉన్న పదవి ఇవ్వడంతో ఆర్కే మనస్థాపం చెందారని, అందుకే పార్టీని వీడారని తెలుస్తోంది. ఏదేమైనా తన రాజీనామాపై ఈరోజు ఆర్కే మీడియా ముందుకు వచ్చి మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది.