ఈ మధ్యకాలంలో మంచు ఫ్యామిలీ పేరు ఏదో ఒక వివాదంలో వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ‘మా’ఎన్నికలలో మంచు విష్ణు ప్యానెల్ పోటీలో నిలుచున్నప్పటి నుంచి…తాజాగా మంచు విష్ణు ఆఫీసులో హెయిర్ డ్రెస్సింగ్ ఎక్విప్ మెంట్ చోరీ కావడం వరకు మంచు కుటుంబ సభ్యుల పేర్లు వార్తల్లో నిలుస్తున్నాయి. తన దగ్గర హెయిర్ స్టైలిస్ట్ గా పనిచేసిన నాగ శ్రీనుపై అనుమానం ఉందని విష్ణు మేనేజర్ సంజయ్…పోలీస్ కంప్లయింట్ ఇవ్వడం కలకలం రేపింది.
అయితే, తనను మోహన్ బాబు, విష్ణు కులంపేరుతో దూషించారని, కొట్టారని నాగ శ్రీను ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో రిలీజ్ చేయడం వైరల్ అయింది. ఆ వ్యవహారం సద్దుమణగక ముందే…తాజాగా మంచు ఫ్యామిలీ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. మోహన్‌బాబు, విష్ణుల పేరిట ఏపీలో సాగుభూమి లేని నిరుపేదలకు కేటాయించే దరఖాస్తు పట్టాలు మంజూరు కావడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఆన్లైన్ రెవెన్యూ రికార్డుల్లోనూ ఈ వివరాలు రావడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లి-68 గ్రామ రెవెన్యూ లెక్క దాఖలా సర్వే నంబరు 412-1ఎలోని 2.79 ఎకరాలు మోహన్‌బాబు పేరిట, 412-1బిలో 1.40 ఎకరాలు విష్ణు పేరిట దరఖాస్తు పట్టా జారీ చేయడం వివాదాస్పదమైంది. అంతేకాదు, 2015లోనే దరఖాస్తు పట్టాలు మంజూరు కాగా…తాజాగా ఆ వివరాలు వెలుగులోకి రావడం సంచలనం రేపుతోంది. అయితే, ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిస్తామని స్థానిక తహసీల్దారు శిరీష అన్నారు.
ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. మంచు మోహన్ బాబు, విష్ణులు నిరుపేదలా? అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు. అయితే, 2015లోని వ్యవహారం ఇప్పుడు వెలుగులోకి రావడం ఏమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇక, జగన్ తో సినీ పెద్దల భేటీ ఆహ్వానాన్ని తనకు అందకుండా కొందరు అడ్డుకున్నారని…మోహన్ బాబు, విష్ణు ఆరోపించడం, ఆ తర్వాత సన్నాఫ్ ఇండియా సినిమా విషయంలో మంచు ఫ్యామిలీపై విపరీతమైన ట్రోలింగ్ జరగడం వంటి పరిణామాలు చూస్తుంటే ఆయన కుటుంబాన్ని ఎవరో టార్గెట్ చేశారని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.