గతంలో టెన్త్ ఎగ్జామ్స్ రద్దుకు పట్టుబట్టి విద్యార్థుల ప్రాణభయం నుంచి తప్పించగలిగారు నారా లోకేష్. తాజాగా టెన్త్ పరీక్ష నిర్వహణలతో అక్రమాలతో వేలాది మంది భవిష్యత్తును కాలరాసే ప్రయత్నం చేసిన జగన్ అడ్డగోలు వ్యవహారాన్ని ఎండగట్టారు. అపుడు ఇపుడు లోకేష్ విద్యార్థుల మనసు గెలిచారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తాజాగా లేఖ సంధించారు. పదోతరగతి పరీక్షల నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్ లీక్.. మాస్ కాపీయింగ్ మాదిరిగా పరీక్షల నిర్వహణ ఉందని దుయ్యబట్టారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారిగా నిర్వహిస్తున్న పదోతరగతి పరీక్షలు నిర్వహణా వైఫల్యంతో పూర్తిగా అభాసుపాలయ్యాయన్నారు. సీఎం అయి మూడేళ్లయినా కరోనా కారణంగా రెండేళ్లు పరీక్షలు జరగలేదని, ఎట్టకేలకు మీ పాలనా యంత్రాంగం నిర్వహించిన పరీక్షలు మన దేశంలోని పరీక్షల చరిత్రలోనే చీకటి అధ్యాయంగా నిలిచాయని లోకేష్ పేర్కొన్నారు.
“రోజుకొక చోట పేపర్ లీక్, మాస్ కాపీయింగ్, ఒకరి బదులు ఒకరు పరీక్షలు రాయించడం, లీకైన ప్రశ్నపత్రాలకి జవాబులు రాయించి జత చేయడం వంటివన్నీ జరిగాయి. ప్రతిభకి కొలమానంగా నిలవాల్సిన పరీక్షలు అక్రమాల విక్రమార్కులకి వరం అయ్యాయి. చాలా చోట్ల పేపర్ లీకై, వైసీపీ వాట్సప్ గ్రూపుల్లో ప్రశ్నాపత్రాలు ప్రత్యక్షం అవడం వైసీపీ నాయకుల పిల్లలకి మెరుగైన మార్కుల కోసం బరితెగించారని స్పష్టం చేస్తోంది. మరోవైపు పీఆర్సీ, సీపీఎస్ రద్దు కోసం మీ ప్రభుత్వంపై నిరసన గళం వినిపించిన ఉపాధ్యాయులపై కక్ష పెట్టుకుని మరీ వేధించేందుకు టెన్త్ పరీక్షల్ని వాడుకుంటున్నారనే అనుమానాలున్నాయి“ అని లోకేష్ పేర్కొన్నారు.
టీచర్లకి టెన్త్ ఫలితాలు టార్గెట్లు పెట్టి, మరోవైపు పేపర్‌లీక్ లకి బాధ్యుల్ని చేస్తూ సస్పెండ్ చేయడమే దీనిని స్పష్టం చేస్తోందని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని తెలిపారు. పదవ తరగతి పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం ఘోర వైఫల్యంపై ప్రభుత్వం స్పందన చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు.
టిడిపి హయాంలో పేపర్ లీక్ అయిన ఘటనలో అప్పటి మంత్రి జీఎంసీ బాలయోగి తన పదవికి రాజీనామా చేసిన చరిత్రని ఒక్కసారి మీకు గుర్తు చేస్తున్నానన్నారు. మీ పాలనలో భ్రష్టుపట్టిన విద్యాశాఖ, ఆ శాఖని చూసే మంత్రుల వల్ల ఇంకా పతనావస్థకి చేరిందన్నీరు.
సీఎంగా మీ వైఫల్యం, అధికారుల చేతగానితనం, వైసీపీ నేతల స్వార్థంతో టెన్త్ పరీక్షల నిర్వహణ అభాసుపాలై 6.22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అయోమయంగా మారిందని లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకా రెండు రోజులు పరీక్షలున్నా.. ఇప్పటివరకూ జరిగిన ప్రతీ పరీక్ష పేపర్ లీకై పరీక్షల నిర్వహణనే అపహాస్యం అయ్యిందన్నారు.
తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మేథ్స్ క్వశ్చన్ పేపర్లు ఎగ్జామ్ సెంటర్ కి చేరకుండానే ముందుగా వైసీపీకి చెందిన వాట్సప్ గ్రూపుల్లో ప్రత్యక్షమవుతున్నాయన్నారు. ఏలూరు జిల్లా మండవల్లి హైస్కూల్లో పేపర్ లీక్ చేయడమే కాకుండా..సమాధానపత్రాలు రాసి అందించడం పరీక్షల నిర్వహణలో డొల్లతనాన్ని వెల్లడిస్తోందని మండిపడ్డారు.
“కృష్ణా జిల్లా పామర్రు, నంద్యాల, నందికొట్కూరుల్లో పేపర్ లీక్ అయ్యింది. చిత్తూరు జిల్లాలో పరీక్ష కేంద్రాన్నే మార్చేయగా, గంగాధర నెల్లూరు మండలం నెల్లేపల్లిలో ఓ టీచర్ మాల్ ప్రాక్టీసుకి పాల్పడటం పదోతరగతి పరీక్షల నిర్వహణ ఎంత అధ్వానంగా ఉందో స్పష్టం చేస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా మాస్ కాపీయింగ్ విపరీతంగా జరగడం కష్టపడి చదివిన విద్యార్థుల పాలిట శాపంగా మారనుంది. పేపర్ల లీక్, మాల్ ప్రాక్టీస్, మాస్ కాపీయింగ్‌పై మీ మంత్రి బొత్స సత్యనారాయణ పరీక్షలు పకడ్బందీగా జరుగుతున్నాయని ఇచ్చిన సమాధానం కూడా బాధ్యతారాహిత్యమే. మంత్రి బొత్సని విద్యాశాఖ నుంచి తప్పించాలి.“ అని డిమాండ్ చేశారు.
ఇంకా మిగిలిన రెండు పరీక్షల్ని అయినా పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఇంత జరుగుతున్నా మీరు కనీసం పేపర్ లీక్ ఘటనల పై సమీక్ష జరపకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి కి అద్దం పడుతుందని లోకేష్ వ్యాఖ్యానించారు.
టెన్త్ పరీక్షల నిర్వహణలో ఎదురైన ఘోరవైఫల్యం నుంచి గుణపాఠం నేర్చుకుని ఇంటర్ పరీక్షలైనా కట్టుదిట్టంగా జరిపేందుకు ఏర్పాట్లు చేయాలని కోరుతున్నానన్నారు. పరీక్షల నిర్వహణలో ఘోరవైఫల్యం చెంది, విద్యార్థుల బంగారు భవిష్యత్తుతో ఆటలాడుకుం టోన్న ఉన్నతాధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు.