పోసాని కృష్ణ మురళితోపాటు పలువురిపై వేసిన పరువునష్టం కేసులో వాంగ్మూలం ఇచ్చేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి కోర్టుకు హాజరయ్యారు. కంతేరులో తనకు భూమి ఉన్నట్టు నిరూపించాలని పోసానికి లోకేష్ సవాల్ విసిరారు. తన పరువుకు భంగం కలిగించిన పోసాని తనకు రూ. 5 కోట్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశఆరు.
రాబోయే ఎన్నికల్లో కూడా మంగళగిరి నుంచే పోటీ చేస్తానని, గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేశారు. తనది కాలేజ్ లైఫ్, జగన్ ది జైల్ లైఫ్ అని లోకేష్ సెటైర్లు వేశారు. తనకు క్లాస్ మేట్స్ ఉంటే, జగన్ కు జైల్ మేట్స్ ఉన్నారని చురకలంటించారు. తాను విదేశాలకు వెళ్లాలనుకుంటే ఎవరి అనుమతి అవసరం లేదని, జగన్ విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తప్పనిసరి అని గుర్తు చేశారు. సీబీఐ కోర్టుల చుట్టూ జగన్ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారాలను ఏపీలో ఆపేశారని, భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని అన్నారు. తాము అంబేద్కర్ రాజ్యాంగాన్ని నమ్ముకున్నామని, రాజారెడ్డి రాజ్యాంగాన్ని కాదని చెప్పారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ లక్షల కోట్లు దోపిడీ చేశారని ఆరోపించారు. తన తాత, తండ్రి ఇద్దరూ ముఖ్యమంత్రులైనప్పటికీ తాను ఏనాడూ అవినీతికి పాల్పడలేదని అన్నారు. ఏపీలో సైకో పాలన సాగుతోందని, రాబోయే ఎన్నికల్లో గెలిచేది టీడీపీనే అని ధీమా వ్యక్తం చేశారు.