టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర చంద్రగిరి నియోజకవర్గంలో దిగ్విజయంగా కొనసాగుతోంది. లోకేష్ పాదయాత్ర చేస్తున్న రహదారి వెంబడి ఆయనకు స్వాగతం పలికేందుకు ప్రజలు బారులు తీరుతున్నారు. లోకేష్ ను కలిసేందుకు రైతులు, మహిళలు యువకులు అన్ని వర్గాల ప్రజలు ఉత్సాహం చూపుతున్నారు. ఈ సందర్భంగా కొండపల్లి క్రాస్ వద్ద మామిడి పండించే రైతులతో లోకేష్ మాట్లాడారు.
ఈ సందర్భంగా జగన్ పాలనపై లోకేష్ నిప్పులు చెరిగారు. చంద్రబాబునాయుడు తన హయాంలో హంద్రీనీవా పనులు 90 శాతం పూర్తి చేశారని, మిగిలిన 10 శాతం పనులను జగన్ పూర్తి చేయలేకపోయారని లోకేష్ విమర్శలు గుప్పించారు. లక్ష కోట్లు దొబ్బి 16 నెలలు జైల్లో ఉన్న మొనగాడు జగన్ ఎప్పుడూ మోసమే చేస్తారంటూ ఆయన ఘాటు విమర్శలు గుప్పించారు. గత ఎన్నికల్లో చంద్రబాబును గెలిపించి ఉంటే ఈపాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ఉండేవారని, గ్రావిటీ ద్వారా రాయలసీమకు నీళ్లు వచ్చి సస్యశ్యామలం అయి ఉండేదని లోకేష్ అన్నారు.
జగన్ హయాంలో దళితుల భూములను బలవంతంగా లాక్కుంటున్నారని, టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే దళితుల భూములు వారికి తిరిగి ఇప్పిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. అంతేకాకుండా, డీకేటీ భూములపై కూడా హక్కులు కల్పిస్తామని భరోసానిచ్చారు. ఇక, కౌలు రైతుల కోసం ప్రత్యేకంగా చట్టం తెస్తామని లోకేష్ వెల్లడించారు. రైతుల పొలాల్లో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్టుగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
రైతులకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ లలోనూ జాప్యం చేస్తోందని లోకేష్ మండిపడ్డారు. ఇక, స్మార్ట్ మీటర్లు అంటూ రైతులను దగా చేసేందుకు జగన్ స్మార్ట్ గా రెడీ అయ్యారని లోకేష్ దుయ్యబట్టారు. ఈ సందర్భంగా గుంతలు పడ్డ రోడ్డు పక్కన నిల్చొని లోకేష్ సెల్పీ దిగారు. జగన్ పాలనలో రోడ్ల దుస్థితి ఇదీ అంటూ లోకేష్ ఎద్దేవా చేశారు. ఆ తర్వాత ముస్లిం మైనారిటీ సోదరులతో సమావేశం నిర్వహించిన లోకేష్ వారి సాధకబాధకాలను తెలుసుకున్నారు.