ఉత్తరాంధ్రను సీఎం జగన్ తన పాలనలో గంజాయి వనంగా మార్చాడని టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ అన్నారు. శంఖారావం పేరిట నిర్వహిస్తున్న బహిరంగ సభ తాజాగా శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురంలో జరిగింది. ఈ సందర్భంగా వైసీపీపై తీవ్రస్థాయిలో ఆయన విరుచుకుపడ్డారు. రెడ్ బుక్ చూస్తుంటే.. వైసీపీ నేతలకు కారిపోతోందని, ప్యాంట్లు తడిచిపోతున్నాయని వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్ర తనకు అమ్మ లాంటిందన్న నారా లోకేష్.. అమ్మ ప్రేమకు కండిషన్స్ ఉండవని వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్ర ప్రజల ప్రేమకు కూడా నిబంధనలు ఉండవని తెలిపారు.
“ఉత్తరాంధ్ర అంటేనే తెలుగుదేశం పార్టీ కంచుకోట, పౌరుషాలకు, పోరాటాలకు పురిటిగడ్డ శ్రీకాకుళం జిల్లా, జగన్ రెడ్డి ఉత్తరాంధ్రను గంజాయి కేంద్రంగా మార్చారు. గరిమెళ్ల, సర్థార్ గౌతు లచ్చన్న, ఎర్రన్నాయుడు పుట్టిన గడ్డ ఇది. ఇచ్ఛాపురం నుంచి శంఖారావం చేపట్టడం నాకు గర్వంగా ఉంది.
జగన్ ప్రతిదానికి సిద్ధం, సిద్ధం అంటున్నాడు, దేనికి జగన్ సిద్ధం? జైలుకు వెళ్లడానికి జగన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. జైలుకు పంపడానికి మీరు సిద్ధమా?“ అని నారా లోకేష్ ప్రజలను ప్రశ్నించారు.
బీసీ బిడ్డ అమర్ నాథ్ గౌడ్ లాంటి వాళ్లను హతమార్చారని వ్యాఖ్యానించారు. డాక్టర్ సుధాకర్ లాంటి దళిత బిడ్డలను, మైనారిటీలను చంపిన జగన్ ను ఇంటికి పంపడానికి మీరు సిద్ధమా? అని ప్రజలను ప్రశ్నించారు. “జగన్ సిద్ధం అంటున్నాడు, దేనికి సిద్ధం? సొంతబాబాయినే లేపాశాడు, ఇంకెంతమంది కుటుంబసభ్యులను లేపడానికి, రాష్ట్రాన్ని నాశనం చేయడానికి జగన్ సిద్ధం? భూకబ్జాలకు సహకరించడలేదని విశాఖలో ఎమ్మార్వో రామయ్యను అతి కిరాతకంగా వైసీపీ నాయకులు చంపేశారు“ అని పేర్కొన్నారు.
“నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ జగన్ రెడ్డి కొత్త నాటకం మొదలుపెట్టారు. 4 నెలల 10 నెలలు ఏం చేశారు? మోసానికి, వంచనకు, దగాకు ప్యాంట్ వేస్తే అది జగన్ రెడ్డి. 23 వేల డీఎస్సీ పోస్ట్ లు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేశారు. నేడు ఉపాధ్యాయ ఖాళీలను తగ్గించారు. యువతలో యువగళం మొదలు కావడంతో కుప్పిగంతులు వేస్తున్నారు. టీడీపీ పాలనలో మొత్తం లక్షా 70వేల పోస్ట్ లు భర్తీ చేయడం జరిగింది. వచ్చే టీడీపీ పాలనలో ప్రతి ఏడాది డీఎస్సీ ప్రకటించి ఖాళీలు భర్తీ చేస్తాం.
సొంత ఛానల్, పేపర్, సిమెంట్ ఫ్యాక్టరీ ఉన్నవాడు పేదవాడు ఎలా అవుతాడు?“ అని నారా లోకేష్ నిలదీశారు.
సొంత చెల్లెలికే భద్రత లేకపోతే మనకు ఎలా రక్షణ ఉంటుందని ప్రశ్నించారు. జగన్ రెడ్డిని చూస్తే కటింగ్, ఫిటింగ్ మాస్టర్ గుర్తొస్తాడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బ్లూ బటన్ తో రూ.10 ఇచ్చి, రెడ్ బటన్ తో వంద నొక్కేస్తున్నారని విమర్శించారు. కరెంట్ ఛార్జీలు, బస్సు ఛార్జీలు పెంచడంతో పాటు చెత్త పన్నుతో ప్రజలను హింసిస్తున్నారని అన్నారు. ప్రజలకు ఉమశమనం కల్పించడానికి చంద్రబాబు, పవన్ కలిపి సూపర్ సిక్స్ ప్రకటించారని తెలిపారు. టీడీపీ అధికారంలోకి వస్తే యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి రూ.3వేలు ఇస్తామన్నారు. స్కూల్ కు వెళ్లే ప్రతి ఒక్కరికి రూ.15వేలు ఇస్తాం, ప్రతి రైతుకు ఏడాదికి రూ.20వేలు ఇస్తామని తెలిపారు.