ఒకవైపు విద్య, ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖలను సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్న మంత్రి నారా లోకేష్.. తన సొంత నియోజకవర్గంపైనా తనదైన శైలిలో దృష్టి పెడుతున్నారు. వారానికి రెండు సార్లు తన నియోజకవర్గంలో ఆయన పర్యటిస్తున్నారు. ఒకవేళ ఏదైనా కారణంగా వారానికి రెండు సార్లు కుదరకపోతే.. కనీసం ఒక్కసారైనా నియోజకవర్గంలో రాజకీయాలపైనా.. ప్రజల పరిస్థితులపైనా ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టి వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ముఖ్యంగా తనదైన శైలిలో మంగళగిరిపై ముద్రవేస్తున్నారు. చేనేతలు దండిగా ఉన్న ఈ నియోజకవర్గం లో వారిని ప్రోత్సహించే ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రి సవితతో సమన్వయం చేసుకుంటూ.. చేనేత వస్త్రాలకు దేశవ్యాప్తంగా మార్కెటింగ్ కల్పించే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇదేసమయంలో మంగళగిరి ప్రజల చిరకాల కోరికలను కూడా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గత 30 ఏళ్లుగా తమ నియోజకవర్గంలో అతి పెద్ద ఆసుపత్రి నిర్మాణం కావాలని..ఇక్కడి వారు కోరుతున్నారు.
తాజాగా మంత్రి నారా లోకేష్ ఆ దిశగా కూడా అడుగులు వేశారు. 100 పడకలతో కూడి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దీనికి సంబంధించి ప్రణాళికలు కూడా రెడీ చేస్తున్నారు. ఇది సాకారం అయి.. వచ్చే నాలుగేళ్లలోనే నిర్మాణం కూడా పూర్తి చేసుకుంటే.. మంగళగిరిపై నారా లోకేష్ ప్రత్యేక ముద్ర వేసిన ట్టు అవుతుంది. అదేసమయంలో పలు మండలాలలో రహదారుల నిర్మాణం జోరుగా సాగుతోంది. ఈ పనులను కూడా ప్రత్యేక శ్రద్ధతో లోకేష్ పర్యవేక్షిస్తున్నారు.