స్కిల్ డెవలప్మెంట్ స్కాం ఆరోపణలతో టిడిపి అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఏపీ సిఐడి పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించి 14 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. అయితే, రాజమండ్రి జైల్లో చంద్రబాబు భద్రతపై ఆయన సతీమణి నారా భువనేశ్వరితో పాటు తనయుడు నారా లోకేష్ చాలాకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జైల్లో చంద్రబాబుకు రక్షణ లేదని ఆయనను హౌస్ రిమాండ్కు అనుమతించాలని ఏసీబీ కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు.
కానీ, ఆ పిటిషన్ తిరస్కరణకు గురి కావడంతో తాజాగా చంద్రబాబు భద్రతపై నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రి జైలులో చంద్రబాబుకు ఏం జరిగినా జగన్ దే బాధ్యత అంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. రాజమండ్రిలో చంద్రబాబును అంతం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని, అందుకే ఆయనను అక్రమంగా అరెస్ట్ చేశారని లోకేష్ ఆరోపించారు. చంద్రబాబును హతమార్చేందుకు, ఆయనకు హాని తలపెట్టేలా ప్లాన్ చేస్తున్నారని, ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ప్రభుత్వం చేసే కుట్ర నిజమని అనుమానాలు బలపడుతున్నాయని లోకేష్ చెప్పారు.
రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీ సత్యనారాయణ డెంగ్యూ బారిన పడి చనిపోయాడని, ఆ తరహాలోనే చంద్రబాబును కూడా చంపేయాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. జైల్లో చంద్రబాబుకు దోమలు కుడుతున్నాయని చెప్పినా అధికారులు పట్టించుకోవడంలేదని భువనేశ్వరి కూడా గతంలో ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబుకు సరైన సౌకర్యాలు కల్పించడం లేదని కూడా ఆమె ఆరోపించారు.