వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకా దారుణ హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న ఆయన ఇంటి వాచ్మెన్ రంగన్న మృతి చెందారు. ఈ కేసులో ఆయన సాక్షిగా ఉన్న విషయం తెలిసిందే. 2019లో జరిగిన దారుణ హత్యలో వివేకానందరెడ్డి ప్రాణాలు కోల్పోయారు. ఆ రోజు రాత్రి రంగన్న ఇంటికి కాపలాగా ఉన్నారు. దీంతో ఆయన సాక్ష్యం అత్యంత కీలకమైందిగా అప్పట్లో సీబీఐ అధికారులు పేర్కొన్నారు. పలుమార్లు ఆయనను విచారించి.. వాంగ్మూలం కూడా నమోదు చేశారు. అయితే.. కేసు ఇంకా తేలకుండానే రంగన్న మృతి చెందడం గమనార్హం.
ఏం జరిగింది?
వాచ్మెన్ రంగన్న సుదీర్ఘకాలంగా వివేకానందరెడ్డి ఇంట్లో పనిచేస్తున్నారు. ఆయన లేనప్పుడు అన్నీ తానై ఇంటిని రక్షించుకు నేవారు. అయితే.. వయసు రీత్యా అనేక సమస్యలు రంగన్నను వెంటాయి. ప్రస్తుతం రంగన్న వయసు 85 సంవత్సరాలు. ఇటీవల ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో తరచుగా ఆయన ఆసుపత్రికి వెళ్లివస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం కూడా.. రంగన్న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అయితే.. లేవలేని స్థితిలో ఉన్న రంగన్న విషయం స్థానిక పోలీసులకు తెలిసింది. దీంతో వారు వచ్చి రంగన్నను ఆసుపత్రికి తరలించారు.
కడపలోని రిమ్స్ ఆసుపత్రిలో సుమారు రెండు గంటల పాటు రంగన్నకు వైద్యులు పలు చికిత్సలు చేసి ప్రాణాలు నిలబెట్టే ప్రయ త్నం చేశారు. కానీ.. పరిస్థితి విషమించి రంగన్న మృతి చెందారని పోలీసులు తెలిపారు. అనంతరం..మృత దేహన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా.. వివేకా హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న రంగన్న మృతి చెందిన విషయం తెలియగానే పులివెందుల ప్రజలు తండోపతండాలుగా.. వివేకా ఇంటికి తరలి వచ్చారు. ఏం జరిగిందో అన్న ప్రచారం కూడా ముందు పెద్ద ఎత్తున జరిగింది. కానీ, చివరకు అనారోగ్యంతో చనిపోయారని తెలుసుకుని అందరూ విచారం వ్యక్తం చేశారు.