తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. గత వారం రోజులుగా అమెరికాలోని పలు ఐటీ కంపెనీల ప్రతినిధులతో పాటు ప్రముఖ ఎన్నారైలతో భేటీ అయిన కేటీఆర్ తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలోనే బే ఏరియాలోని ఎన్నారైలు, ఐటీ సంస్థల ప్రతినిధులతో ‘తెలంగాణలో ఐటీ పెట్టుబడులు’ అనే అంశంపై కేటీఆర్ సమావేశం నిర్వహించారు.
ఐటీ సర్వ్ అలయెన్స్ (IT Serve Alliance) బే ఏరియా విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ఐటీ సర్వ్ అలయెన్స్ కు చెందిన 250 మంది ఐటీ రంగ ప్రముఖులనుద్దేశించి కేటీఆర్ ప్రసంగించారు. ఏడేళ్ల కింద పుట్టిన తెలంగాణ…కేసీఆర్ గారి నాయకత్వంలో ఎంతో ఎదిగిందని చెప్పారు. విద్యుత్ కొరత, నీటి ఎద్దడి వంటి సమస్యలను అధిగమించామని అన్నారు. భారతదేశంలో ఐటీకి కేంద్రంగా కొనసాగిన బెంగళూరు కన్నా అభివృద్ధిలో దూసుకుపోతున్న హైదరాబాద్ నగరమే ఇప్పుడు ఐటీకి ప్రధాన కేంద్రంగా మారిందని కేటీఆర్ అన్నారు.
అమెజాన్, గూగుల్, యాపిల్, ఫేస్బుక్ తదితర అనేక పెద్ద కంపెనీలు హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని ద్వితీయ శ్రేణి (టైర్-2) పట్టణాల్లో కూడా కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నాయని చెప్పారు. హైదరాబాద్‌లో క్వాల్కామ్ సంస్థ రెండో అతిపెద్ద కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఇటీవలే ప్రకటించిందని చెప్పారు. ఐటీ రంగం హైటెక్ సిటీ, కొండాపూర్, మాదాపూర్‌లకు పరిమితం కాకుండా ఉప్పల్, ఎల్బీనగర్ వంటి తూర్పు, కండ్లకోయ వంటి ఉత్తర ప్రాంతాలకు కూడా విస్తరించిదని చెప్పారు.
వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌నగర్, నిజామాబాద్ వంటి ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు కూడా ఐటీ పరిశ్రమ విస్తరిస్తోందని చెప్పారు. ఈ నగరాల్లో ఐటీ టవర్లు ఏర్పాటుచేసి ప్లగ్ అండ్ ప్లే సౌకర్యం కల్పిస్తున్నామని, రూరల్ టెక్ పాలసీలో భాగంగా వచ్చే ఐదేళ్లలో 50 వేల ఉద్యోగాలు ఈ టైర్-2, టైర్-3 నగరాల్లో కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. అక్కడ పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఐటీ సర్వ్ అలయెన్స్ ప్రతినిధులను కేటీఆర్ కోరారు. ఈ సందర్భంగా తమతో భేటీ అయినందుకు కేటీఆర్ కు ఐటీ సర్వ్ అలయెన్స్ సభ్యులు హరి గక్కాని, వినయ్, అమిత్ గోయల్, రాహుల్ కుర్విల్లా, షబానా, సమీర్, రాజీవ్ ధన్యవాదాలు తెలిపారు.
ఐటీ సర్వ్ అలయెన్స్ (IT Serve Alliance) అనేది ఐటీ రంగానికి చెందిన 1400 కంపెనీలతో ఏర్పడిన ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. అమెరికాలోని 22 రాష్ట్రాలలో ఉన్న 19 చాప్టర్లలో ఈ సంస్థ ఐటీ సేవలను అందిస్తోంది. ఈ సంస్థలో ఉన్న ఐటీ కంపెనీల మొత్తం ఆదాయం 10 బిలియన్ డాలర్లు. లక్ష మంది ఐటీ నిపుణులు ఈ సంస్థల్లో పనిచేస్తున్నారు.