టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకంపై కాంగ్రెస్ లోని కొందరు నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ మాజీ ఇన్ఛార్జ్, టీపీసీసీ మాజీ కార్యదర్శి పాడి కౌశిక్‌రెడ్డి కూడా రేవంత్ పై విమర్శలు గుప్పించారు. మంత్రి కేటీఆర్ తో ఇటీవల భేటీ అయిన కౌశిక్..త్వరలోనే కారెక్కబోతున్నారన్న ప్రచారానికి ఊతమిచ్చేలా షోకాజ్ నోటీసు అందుకున్న వెంటనే కౌశిక్.. ప్లేటు ఫిరాయించారు.
తనపై వేటు తప్పదని తెలుసుకున్న కౌశిక్…తాజాగా కాంగ్రెస్ కు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. పార్టీ అధిష్ఠానానికి తన రాజీనామా పత్రాన్ని పంపిన కౌశిక్…త్వరలోనే టీఆర్ఎస్ లో చేరబోతున్నారని, హుజురాబాద్ టికెట్ ఆశిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. హుజురాబాద్ టికెట్ తనకే వస్తుందని ఓ కార్యకర్తతో ఫోన్లో కౌశిక్ మాట్లాడిన ఆడియో క్లిప్ సంచలనం సృష్టించింది. దీనిపై వివరణ కోరుతూ కాంగ్రెస్ అధిష్టానం కౌశిక్ కు షోకాజ్ నోటీసు పంపించింది.
24 గంటల్లో వివరణ ఇవ్వాలని కోరగా… షోకాజ్ నోటీసు అందుకున్న 24 గంటల్లోనే కౌశిక్ రెడ్డి రాజీనామా ప్రకటించారు. అంతకుముందు, రేవంత్ పై కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాణిక్కం ఠాగూర్‌కు రూ.50 కోట్లు ఇచ్చి రేవంత్ పదవి పొందారని ఆరోపించారు. మాణిక్కం ఠాగూర్ ఓ యూజ్ లెస్ ఫెలో అంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి కంటే ఉత్తమ్ రెడ్డి లక్ష రెట్లు నయం అని,సినిమా యాక్టర్లా రేవంత్ రెడ్డి ఫీల్ అవుతున్నారని షాకింగ్ కామెంట్లు చేశారు.
టీపీసీసీ చీఫ్ పదవి వస్తే సీఎం అయినట్టు భావిస్తున్నారని ఈటలకు రేవంత్ రెడ్డి అమ్ముడుపోయారని ఆరోపించారు. సినిమాలో ముమైత్ ఖాన్ వస్తే చప్పట్లు, ఈలలు కొడతారని రేవంత్ నుద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి దిక్కు లేదని, సీఎం సీఎం అంటే సరిపోతుందా అని కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి.