పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మైథాలజీ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ ఫిల్మ్ `కల్కి 2898 ఏడీ` గురువారం అట్టహాసంగా విడుదలైన సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన కల్కి మూవీ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ప్రభాస్-అమితాబ్ యాక్టింగ్, విజువల్స్, యాక్షన్ సీన్స్ తో పాటు మహాభారతం ట్రాక్ సినిమాకు హైలెట్ గా నిలిచింది.
మూడు గంటల సినిమాలో 30 నిమిషాలు మహాభారతం సీన్స్ ను పెట్టారు. అందులో కృష్ణుడు, అర్జునుడు, కర్ణుడు, ఉత్తర, అశ్వత్థామ పాత్రలను చూపించారు. అర్జునుడిగా విజయ్ దేవరకొండ, కర్ణుడిగా ప్రభాస్, అశ్వత్థామ గా అమితాబ్ బచ్చన్, ఉత్తరగా మాళవిక నాయర్ కనిపించారు. వీరీ లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే శ్రీ కృష్ణుడి పాత్రదారి ముఖాన్ని చూపించకుండా ఆహార్యం మాత్రమే కనిపించేలా నాగ్ అశ్విన్ సీన్స్ ను డిజైన్ చేశాడు.
దీంతో ఆ క్యారెక్టర్ ను పోషించిన యాక్టర్ ఎవరా అని సినిమా ప్రియులు ఆరాలు తీయగా అసలు విషయం బయటపడింది. కల్కిలో కృష్ణుడిగా నటించింది ఒకరైతే.. ఆ పాత్రకు డబ్బింగ్ చెప్పింది మరొకరు. తమిళ నటుడు కృష్ణ కుమార్ కల్కి మూవీలో కృష్ణుడిగా యాక్ట్ చేశాడు. ఇతను తెలుగు ప్రేక్షకులకు పెద్దలు తెలియదు. థియేటర్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన కృష్ణ కుమార్.. ఇప్పుడిప్పుడు సినిమాల్లో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.
గతంలో సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన డబ్బింగ్ చిత్రం `ఆకాశం నీ హద్దురా`లో సూర్య స్నేహితుడిగా కృష్ణ కుమార్ నటించాడు. ధనుష్ మారన్ లోనూ కీలక పాత్రలో కనిపించాడు. ఇక కల్కిలో కృష్ణుడి పాత్రకు డబ్బింగ్ చెప్పింది మరెవరో కాదు ప్రముఖ నటుడు అర్జున్ దాస్. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా సత్తా చాటుతున్న అర్జున్ దాస్.. తెలుగుతో పాటు హిందీ వెర్షన్ కు కూడా డబ్బింగ్ చెప్పి కృష్ణుడి పాత్రకు తన గంభీరమైన స్వరంతో ప్రానం పోశాడు.