స్కిల్ స్కాంలో ప్రస్తుతం జైలు జీవితాన్ని అనుభవిస్తున్న ఏపీ విపక్ష నేత చంద్రబాబు బెయిల్ కోసం తీవ్రప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. ఆయనకు ఎప్పటికప్పుడు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. దగ్గర దగ్గర యాభై రోజులకు ఆయన జైలు జీవితం వచ్చేసింది. వ్యవస్థల్ని మేనేజ్ చేసే విషయంలో చంద్రబాబుకున్న టాలెంట్ అంతా ఇంతా కాదని ప్రచారం చేసే వారంతా.. ఇప్పుడు చోటు చేసుకుంటున్న పరిణామాల్ని చూసి.. ‘నిజంగానే వ్యవస్థల్ని మేనేజ్ చేసే సత్తా ఉంటే.. కనీసం మూడు వారాలకైనా బెయిల్ పొందే వీలుండాలి కదా? అలాంటిదెందుకు చోటు చేసుకోలేదు?’’ అన్న ప్రశ్నల్ని సంధిస్తున్నారు.
అయితే.. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు జైలు ఎపిసోడ్ మొత్తాన్ని చూసినప్పుడు… ఆయన మీద చేసే ఆరోపణలకు.. వాస్తవానికి మధ్య అంతరం ఎక్కువన్న విషయాన్ని పలువురు ఒప్పుకుంటున్నారు. నిజంగానే ఆయనకు వ్యవస్థల్నిమేనేజ్ చేసే సామర్థ్యం ఉండి ఉంటే.. ఇంతకాలం జైలుజీవితాన్ని గడపాల్సిన అవసరం ఉండేది కాదంటున్నారు. అంతేకాదు.. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న వేళ.. కనీసం ఆసుపత్రిలో చేరేందుకు వీలుగా అనుమతులు కూడా తెచ్చుకోలేకపోయారన్న మాట వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు.. సదరు పిటిషన్ ను విచారించాల్సిన జస్టిస్ జ్యోతిర్మయి.. నాట్ బిఫోర్ పేరుతో విచారణను అంగీకరించకుండా.. దీన్ని ఎవరు విచారించాలన్న అంశాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వదిలేసిన వెళ్లిన వైనంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ చర్చలో చంద్రబాబు వ్యతిరేక వర్గం వాదన ఒకలా ఉంటే.. చంద్రబాబు మద్దతుదారుల వాదన మరోలా ఉంది.
ముందుగా చంద్రబాబు వ్యతిరేకుల వాదన చూస్తే.. బెయిల్ కోసం చంద్రబాబు తరఫు న్యాయవాది బసవేశ్వరరావు వకాలతో వేయగా.. తాజాగా ఈ కేసుతో సంబంధం లేని.. టీడీపీతో సంబంధాలు లేని జీవీఎల్ మూర్తితో వకాలత్ వేయించారని ఆరోపిస్తున్నారు. మూర్తితో వకాలత్ వేయించటం ద్వారా జస్టిస్ ప్రతాప వెంకట జ్యోతిర్మయి ముందు బెయిల్ పిటిషన్ రాకుండా చేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నినట్లుగా ఆరోపిస్తున్నారు.
దీనికి కారణం.. జస్టిస్ జ్యోతిర్మయి ముక్కుసూటిగా వ్యవహరిస్తారని.. ఆమె బెంచ్ మీదకు పిటిషన్ విచారణకు వెళితే తాము కోరుకున్నట్లుగా బెయిల్ రాదన్న ఉద్దేశంతోనే బాబు అండ్ కో కుట్ర పన్నినట్లుగా ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగా న్యాయవాది మూర్తి సతీమణి ఇందిరా ప్రియదర్శిని కింది కోర్టులో జడ్జిగా పని చేస్తున్నారు. న్యాయాధికారి కావటంతో ఆమెకు జస్టిస్ జ్యోతిర్మయి తెలుసు. తనకు మూర్తి సతీమణితో పరిచయం ఉన్న నేపథ్యంలో హైకోర్టులో మూర్తి తన ముందు దాఖలు చేసే కేసులను విచారించకుడదన్న నైతిక విలువలకు కట్టుబడి ఆమె నాట్ బిఫోర్ నిర్ణయాన్ని తీసుకున్నారని చెబుతున్నారు.
జస్టిస్ జ్యోతిర్మయి నైతిక విలువలను చంద్రబాబు అండ్ కో ఒక అవకాశంగా మలుచుకున్నట్లుగా ఆరోపిస్తున్నారు. అయితే.. ఈ వాదనను చంద్రబాబు వర్గీయులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఒకవేళ.. తాము ఆ ఆట ఆడితే.. తమకే నష్టం జరుగుతుందన్న విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు జస్టిస్ జ్యోతిర్మయి తీసుకున్న నిర్ణయం కారణంగా.. ఎవరు చంద్రబాబు పిటిషన్ ను విచారించాలన్న దానిపై ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం తీసుకోవాలని కోరటం బాబుకు ఇబ్బందేనని చెబుతున్నారు.
అదెలానంటే.. ఇప్పటికే చంద్రబాబు కేసును విచారించే వేళ.. ఏదో ఒక ప్రచారాన్ని తీసుకురావటం బాబు వ్యతిరేకులు చేస్తున్నారని.. వ్యవస్థల్ని మేనేజ్ చేయటం పేరుతో జరుగుతున్న ప్రచార ప్రభావానికి న్యాయమూర్తులు గురి కావాలన్న వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లుగా చెబుతున్నారు. దీనికి తాజాగా జరుగుతున్న ప్రచారాన్ని ఒక ఉదాహరణగా చూపిస్తున్నారు.
జస్టిస్ జ్యోతిర్మయి విచారణను తప్పుకుంటే చంద్రబాబు బెయిల్ పిటిషన్.. మధ్యంతర బెయిల్ పిటిషన్లు జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు లేదంటే జస్టిస్ అడుసుమిల్లి రవీంద్రబాబు ముందుకు వస్తాయని ప్రచారమే దీనికి నిదర్శనమని చెబుతున్నారు. ఇలా కొందరు న్యాయమూర్తుల పేర్లను మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ ప్రచారంలోకి తీసుకురావటం ద్వారా.. తెలియని ఒత్తిడిని తీసుకొస్తున్నట్లుగా వ్యాఖ్యానిస్తున్నారు. గతంలోనూ పలువురు ప్రముఖులు కేసుల బారిన పడి.. జైలుకు వెళ్లిన సందర్భంలోనూ కోర్టు విచారణ ప్రక్రియకు సంబంధించిన అంశాలే తప్పించి.. న్యాయమూర్తులకు సంబంధించిన వివరాలతో వార్తల్ని ప్రచురించే ధోరణి లేదని.. చంద్రబాబు విషయానికి వస్తే.. ఇలాంటి సరికొత్త ప్రక్రియకు తెర తీసినట్లుగా మండిపడుతున్నారు. ఏదో ఒక పేరుతో వీలైనంత ఎక్కువ కాలం చంద్రబాబు జైల్లో ఉండేందుకు వీలుగా ప్లానింగ్ జరుగుతుందంటున్నారు.
జస్టిస్ జ్యోతిర్మయి నాట్ బిఫోర్ కారణంగా.. విచారణ మరికొన్ని రోజులు వాయిదా పడటాన్ని ప్రస్తావిస్తూ.. నిజంగానే జస్టిస్ జ్యోతిర్మయి విచారణ జరపకుండా నాట్ బిఫోర్ ను వినియోగించుకోవాలన్నదే చంద్రబాబు అండ్ కో వ్యూహమైతే.. దానికి సంబంధించిన రిస్కు కూడా వారు ఆలోచించకుండా ఉంటారా?అని ప్రశ్నిస్తున్నారు. జస్టిస్ జ్యోతిర్మయి నాట్ బిఫోర్ అని పేర్కొనటంతో పాటు ప్రధాన న్యాయమూర్తి ఎవరు విచారణ జరపాలనే దానిపై నిర్ణయం తీసుకోవాలని కోరటం.. మిగిలిన వారి విచారణకు సంబంధించిన అంశాల మీద మీడియాలో వార్తలు వచ్చేస్తున్న వేళ.. కేసును విచారించే న్యాయమూర్తి మీద ఉండే ఒత్తిడి చంద్రబాబుకు ప్రతికూలంగామారుతుంది కదా? అని ప్రశ్నిస్తున్నారు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న చంద్రబాబు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో బెయిల్ ఆలస్యం కావాలని కోరుకోరని.. ఇదంతా ఆయన ప్రత్యర్థులు వ్యూహాత్మకంగా చేస్తున్న దాడిగా అభివర్ణిస్తున్నారు.