యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం `దేవర` మూవీ సక్సెస్ జోష్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఒకటి కాదు రెండు కాదు దాదాపు ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ నుంచి వచ్చిన ఈ సోలో మూవీ.. మొదట మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం చెలరేగిపోయింది. వసూళ్ల వర్షాన్ని కురిపించింది. విడుదలైన ఆరు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను చిత్తు చిత్తు చేసి లాభాల బాట పట్టింది. రాజమౌళితో సినిమా చేశాక సదరు హీరో నెక్స్ట్ మూవీ డిజాస్టర్ అవుతుందనే బలమైన బ్యాడ్ సెంటిమెంట్ ను ఎన్టీఆర్ బ్రేక్ చేసి పడేశారు.
అలాగే దేవర హిట్ తో కొరటాల శివ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చారు. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తొలి ప్రయత్నం లోనే సూపర్ సక్సెస్ ను అందుకుంది. అయితే దేవర విషయాన్ని పురస్కరించుకొని నిర్మాతలు తాజాగా ఒక గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ సక్సెస్ పార్టీలో దేవర టీమ్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు మరియు తెలుగు రాష్ట్రాల బయ్యర్లు కూడా పాల్గొన్నారు. అయితే ఈ ఈవెంట్ లో ఎన్టీఆర్ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
దేవర మూవీ సక్సెస్ గురించి, కొరటాల శివ గురించి ముందుగా ఎన్టీఆర్ మాట్లాడారు. అలాగే అభిమానుల నుంచి తాను పొందుతున్న అభిమానానికి, ప్రేమకు వచ్చే జన్మలో ఋణం తీర్చుకుంటానని.. ఈ జన్మలో తాను తీరుస్తున్నది వడ్డీ మాత్రమేనని హత్తుకునే మాటలతో ఫ్యాన్స్ ని ఎన్టీఆర్ ఆనందపరిచారు. అయితే చివర్లో ప్రొడ్యూసర్ కోసరాజు హరికృష్ణ గురించి మాట్లాడుతూ.. `ముందుకు ఎప్పుడు రాడు వెనకే నుంచుంటాడు. చాలామంది అతన్ని సరిగ్గా అర్థం చేసుకోరు. అతనే మా హరి.
ఎవరేమన్నా ఎవరేమనుకున్నా ఎన్టీఆర్ ఆర్ట్స్ కు మూల స్తంభం హరి. నాకు, కళ్యాణ్ అన్నకి బలం హరి. నచ్చిన వాళ్ళు ఈ విషయాన్ని జీర్ణించుకుంటారు. నచ్చని వాళ్ళు ఈ విషయాన్ని జీర్ణించుకోవాల్సిన అవసరం లేదు` అంటూ ఎన్టీఆర్ కొంచెం ఘాటుగా వ్యాఖ్యానించారు. అయితే ఎన్టీఆర్ ఈ విధంగా కామెంట్స్ చేయడానికి కారణం లేకపోలేదు. నిర్మాత హరి కళ్యాణ్ రామ్ కు బావమరిది. చాలా కాలం నుంచి ఆయన ఎన్టీఆర్ ఆర్ట్స్ కి సంబంధించిన ప్రతి అంశాన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు.
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మితమయ్యే ఎన్టీఆర్ సినిమాలకు సంబంధించిన ప్రమోషన్స్, ప్రొడక్షన్ అప్డేట్స్ అన్ని హ్యాండిల్ చేసేది హరినే. అయితే హరి వచ్చాక తారక్ మరియు ఫ్యాన్స్ కి మధ్య గ్యాప్ వచ్చిందని టాక్ ఎప్పటినుంచో ఉంది. పైగా ఈమధ్య దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ ఆఖరి నిమిషాల్లో బెడిసి కొట్టడం, అభిమానుల మధ్య కోలాహలంగా చేసుకోవాల్సిన సక్సెస్ మీట్ క్యాన్సిల్ అవడం వంటి అంశాలు హరి పై నెగిటివిటీని పెంచాతయా.ఇ దీంతో అభిమానులు హరిని టార్గెట్ చేశారు. ఆయన తీసేయాలంటూ సోషల్ మీడియాలో గొడవ చేశారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు తనదైన స్టైల్ లో స్వీట్ వార్నింగ్ ఇచ్చారని వార్తలు వస్తున్నాయి.