వైసీపీలో వసంత కృష్ణప్రసాద్ వ్యవహారం ముదురుతోంది. ఆయన పార్టీపై అసంతృప్తి వ్యక్తంచేస్తూనే ఉన్నారు. జగన్ పిలిచి వార్నింగ్‌లు ఇచ్చినా ఆయన తగ్గేదేలే అంటున్నారు. ముఖ్యంగా మంత్రి జోగి రమేశ్‌ను లక్ష్యంగా చేసుకుని కృష్ణప్రసాద్ కామెంట్లు చేస్తున్నారు. తన నియోజకవర్గం మైలవరంలో జోగి రమేశ్ అనవసరంగా వేలు పెడుతున్నారన్నది కృష్ణప్రసాద్ ఆరోపణ.
వసంత కృష్ణప్రసాద్‌ది మైలవరం నియోజకవర్గం. జోగి రమేశ్‌ది పెడన నియోజకవర్గం. మైలవరం నియోజకవర్గం తెలంగాణ సరిహద్దులకు సమీపంలో ఉంటే పెడన నియోజకవర్గం బంగాళాఖాతం తీరంలో ఉంది. రెండు నియోజకవర్గ కేంద్రాల మధ్య సుమారు 120 కిలోమీటర్ల దూరం ఉంటుంది.
ఈ రెండూ పక్కపక్క నియోజకవర్గాలు కాదు. అలాగే… మైలవరానికి సంబంధించిన జోగి రమేశ్‌కు ఎలాంటి బాధ్యతలూ లేవు కూడా. ఇంచార్జి మంత్రిగా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవహరిస్తున్నారు కానీ జోగి రమేశేమీ ఆ బాధ్యతల్లో లేరు. అలాంటిది మైలవరంలో జోగి రమేశ్‌కు ఎందుకంత ఇంట్రెస్ట్ అనేది చాలామందికి అర్థం కాని విషయం.
వసంత కృష్ణప్రసాద్ ప్రాతినిధ్య వహిస్తున్న మైలవరంలో జోగి రమేశ్ వేలు పెడుతుండడానికి కారణం ఉంది. జోగి రమేశ్ తన కుమారుడు రాజీవ్‌ను ఈసారి అసెంబ్లీ బరిలో దించాలనుకుంటున్నారు. అలా అని రమేశ్ ఏమీ పోటీ నుంచి తప్పుకోవడం లేదు. తాను పెడన నుంచి చేస్తూ కుమారుడిని వేరే ఏదైనా నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలన్నది జోగి రమేశ్ ప్లాన్. కానీ.. పెడన చుట్టుపక్కల నియోజవర్గాలేవీ కొడుకు కోసం అంతగా అనుకూలంగా అనిపించలేదట జోగి రమేశ్‌కు.
మైలవరం అయితే తన కుమారుడు రాజీవ్ పోటీ చేయడానికి బాగుంటుందన్నది రమేశ్ అభిప్రాయమని చెప్తున్నారు ఆయన అనుచరులు. మైలవరంలో దేవినేని ఉమాతో గట్టి పోటీ ఉంటుందని తెలిసినా ఆ నియోజకవర్గంలో గౌడ్ ఓటర్ల సంఖ్య ఎక్కువ కావడంతో జోగి రమేశ్ తన కుమారుడు రాజీవ్ గౌడ్ కోసం ఆ నియోజకవర్గాన్ని సెలక్ట్ చేశారు.
రాజీవ్ గౌడ్ కొద్దికాలం కిందట విదేశాల నుంచి ఇండియాకు వచ్చారు. కొద్దినెలలుగా ఆయన మైలవరం నియోజకవర్గంలో తిరుగుతున్నారు. జోగి రమేశ్‌కు అనుకూలంగా ఉండే మాజీ జడ్పీటీసీ, మరికొందరు నేతలతో కలిసి ఆయన విస్తృతంగా తిరుగుతున్నారు. ఈ క్రమంలోనే ఎక్కడికక్కడ రాజీవ్ గౌడ్, జోగి రమేశ్‌ల ఫొటోలతో ఫ్లెక్సీలు, బ్యానర్లు మైలవరంలో కనిపిస్తున్నాయి. ఇదీ.. వసంత కృష్ణప్రసాద్, జోగి రమేశ్ మధ్య గొడవ.
Nandigamaలో YCP భారీర్యాలీ..హాజరైన మంత్రి @JogiRamesh ఏదీ G.O 1 అమలు? ఎక్కడా నీతి వ్యాఖ్యలు వల్లించిన మేధావులు? ????ఎక్కడా అధికార యంత్రాంగం? అడ్డగింపులు లేవేమీ? ????చట్టాలు ప్రతిపక్షాలకే పరిమితమా?అధికారపక్షం అతీతులా? @SRKRSajjala @YSRCParty @PawanKalyan @ysjagan @JanaSenaParty pic.twitter.com/7rYnZ3HHT2
— నూకల వెంకట సత్యనారాయణ రావు (@Narayanaraonook) January 6, 2023