ఏపీలో 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మూడు స్థానాలు ఎవరికి దక్కుతాయి, కూటమిలోని ఏ పార్టీకి ఎన్ని దక్కుతాయి అన్న విషయంపై ఉత్కంఠ ఏర్పడింది. ఈ క్రమంలోనే తాజాగా వాటిలో ఒక సీటు జనసేన నేత నాగబాబు కు దాదాపుగా ఖరారైందన్న ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ టూర్ లో ఆ విషయంపై బీజేపీ పెద్దలతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంతనాలు జరిపారని టాక్ వస్తోంది.
వచ్చే నెలలో జరగనున్న ఈ ఎన్నికలలో తన సోదరుడిని పెద్దల సభకు పంపేందుకు సీఎం చంద్రబాబుతో కూడా పవన్ కల్యాణ్ మాట్లాడారని ప్రచారం జరుగుతోంది. అందుకు చంద్రబాబు కూడా సూత్రప్రాయంగా అంగీకరించారని తెలుస్తోంది. ఒకవేళ నాగబాబుకు ఒక సీట్ కన్ఫర్మ్ అయితే, మిగతా రెండు సీట్లు ఎవరికి అన్న సస్పెన్స్ వీడలేదు. టీడీపీ నుంచి అశోక్ గజపతి రాజు, యనమల రామకృష్ణుడు వంటి సీనియర్ నేతల పేర్లు ప్రచారంలో ఉన్నాయి.
వచ్చే నెల మూడో తేదీ నుంచి రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. డిసెంబర్ 20న పోలింగ్ నిర్వహించి అదే రోజున ఫలితాలు వెల్లడిస్తారు. ఒక్క అభ్యర్థి రాజ్యసభకు ఎన్నిక కావాలంటే కనీసం 25 మంది ఎమ్మెల్యేల మద్దతుండాలి. ఈ లెక్కన వైసీపీకి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే చాన్స్ లేదు. కూటమికి 164 సీట్లు ఉన్న నేపథ్యంలో ముగ్గురి ఎంపిక లాంఛనమే.