2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి బీజేపీ అండ ఉంది అన్న ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. కేంద్రంలోని బీజేపీ పెద్దల సహకారంతోనే రాష్ట్రంలో జగన్ అధికారం చేపట్టారని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి. ఆ మైత్రి బంధానికి అనుగుణంగానే సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నాలుగేళ్లయినా ఓ కొలిక్కి రాలేదు అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, గత ఆరు నెలలుగా రాష్ట్రంలో బీజేపీతో వైసీపీకి సత్సంబంధాలు దెబ్బతిన్నాయని టాక్ వస్తోంది.
ఈ క్రమంలోనే తాజాగా నిన్న విశాఖపట్నంలో పర్యటించిన కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షా.. వైసిపి నేతలపై, ఏపీ సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత నాలుగేళ్లుగా కేంద్రం…రాష్ట్రాభివృద్ధి కోసం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని, కానీ, రాష్ట్రంలో అభివృద్ధి కనిపించడం లేదని అమిత్ షా మండిపడ్డారు. అభివృద్ధి చేయకుండా ఆ డబ్బులు ఏం చేశారని జగన్ కి సిగ్గుందా అని అమిత్ షా ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే అమిత్ షా వ్యాఖ్యలపై సీఎం జగన్ పరోక్షంగా స్పందించారు. తమకు బీజేపీ అండ లేకపోయినా పర్వాలేదని జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాను కేవలం ప్రజలను నమ్ముకున్నానని జగన్ షాకింగ్ కామెంట్లు చేశారు. రాబోయే ఎన్నికలలో జనాన్ని నమ్ముకుని బరిలోకి దిగుతున్నానని జగన్ పల్నాడు జిల్లా క్రోసూరులో జరిగిన బహిరంగ సభలో ప్రకటించారు. తాజాగా జగన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీతో వైసీపీకి చెడిందని, త్వరలో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ వంటి పరిణామాలు జరగవచ్చని అభిప్రాయపడుతున్నారు. టీడీపీతో మైత్రి నేపథ్యంలోనే వైసీపీని బీజేపీ దూరం పెడుతోందని అంటున్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ-జనసేనల పొత్తుకు తాజా వ్యాఖ్యలు బలం చేకూర్చాయని అంటున్నారు.