జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రెండేళ్ళల్లో రెండు భారీ పరిశ్రమలు మూతపడటం సంచలనంగా మారింది. మొదటిదేమో సొంత జిల్లా కడపలోనే ఉన్న జువారి సిమెంట్ పరిశ్రమకాగా రెండోది చిత్తూరు జిల్లాలోని అమరరాజా పరిశ్రమ. రెండు కూడా పారిశ్రామికరంగంలో మంచి ట్రాక్ రికార్డున్న పరిశ్రమలే కావటం గమనార్హం. విచిత్రమేమిటంటే రెండు పరిశ్రమలను కూడా వాతావరణ కాలుష్యమని, నీటి కాలుష్యం పేరుతో నోటీసులిచ్చి అధికారులు మూయించేశారు.
జువారి సిమెంట్ పరిశ్రమ దశాబ్దాలుగా బాగా పాపులర్ అన్న విషయం తెలిసిందే. ఏడాదికి సుమారు 12 వేల టన్నుల సిమెంటును ఉత్పత్తి చేస్తోంది. ఇలాంటి పరిశ్రమను వాతావరణ, నీటి కాలుష్యానికి కారణమవుతోందనే కారణాలతో ప్రభుత్వం నోటీసులిచ్చింది. తర్వాత కొద్దిరోజులకే మూతపడిపోయింది. జువారి సిమెంట్ మూతవెనుక రాజకీయపరమైన ఆరోపణలు కూడా వినబడుతున్నాయి.
జగన్ కుటుంబం సిమెంట్ పరిశ్రమపై కన్నేసిందనే ప్రచారం జరుగుతోంది. అమ్మటానికి పరిశ్రమ యాజమాన్యం నిరాకరించటంతో చివరకు మూయించేశారని అంటున్నారు. పరిశ్రమ పరిధిలో వాతావరణ, నీటి కాలుష్యం జరుగుతున్నది కూడా వాస్తవమే అని అంటున్నారు. అయితే ఇంతమాత్రానికే పరిశ్రమను మూయించేయాల్సిన అవసరం ఉందా ? దీనికి ప్రత్యామ్నాయం లేదా ? అనే ప్రశ్నలు వినబడుతున్నాయి.
ఇపుడు అమరరాజా ఫ్యాక్టరీ విషయం చూస్తే ఈ యాజమాన్యానికి కూడా మంచి ట్రాక్ రికార్డే ఉంది. దశాబ్దాలుగా ఫ్యాక్టరీ నడుపుతున్నా కాలుష్యానికి కారణం కాకూడదనేమీలేదు. మామూలుగా అయితే వాతావరణ, నీటి కాలుష్య నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం తరపున యాజమాన్యాన్ని హెచ్చరించటం సబబుగా ఉంటుంది. అప్పుడు కూడా యాజమాన్యం చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వం తీవ్రమైన చర్యలకు దిగటంలో తప్పులేదు.
పైగా మూసివేత చర్యలు రాజకీయంగా వివాదాస్పదమవుతోంది. ఎందకంటే అమరరాజా యాజమాన్యంలో కీలకపాత్ర పోషిస్తున్న గల్లా జయదేవ్ గుంటూరు టీడీపీ ఎంపి అన్న విషయం తెలిసిందే. అందుకనే రాజకీయ వివాదం రేగుతోంది. మరి ఈ వివాదంపై ప్రభుత్వం ఏమి సమాధానం ఇస్తుందో చూడాలి.