విశాఖలో విశాఖ గర్జన, పవన్ కల్యాణ్ పర్యటనల నేపథ్యంలో హై టెన్షన్ వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే. విశాఖలోని పోర్టు కళావాహిని స్టేడియంలో జరగాల్సిన జనసేన పార్టీ జనవాణి కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, పవన్ బస చేసిన నోవోటెల్ హోటల్ వద్దకు భారీగా జనసైనికులు, పవన్ అభిమానులు తరలివచ్చారు. దీంతో, జనసైనికులపై పోలీసులు లాఠీ ఛార్జి చేసి అక్కడి నుంచి చెదరగొట్టారు. ఓ దశలో పవన్ ను అరెస్టు చేస్తారని కూడా ప్రచారం జరిగింది.
దీంతో, పవన్ హోటల్ లోనే జనసేన కార్యకర్తల కుటుంబాలకు చెక్కుల పంపిణీ చేపట్టారు. హోటల్ లో తన గది నుంచే రోడ్డుపై ఉన్న అభిమానులకు పవన్ అభివాదం చేశారు. అంతకుముందు, విశాఖ విమానాశ్రయం వద్ద వైసీపీ మంత్రులపై జరిగిన దాడి కేసులో అరెస్ట్ అయిన జనసేన నాయకులు, కార్యకర్తలకు కోర్టులో ఊరట లభించింది. అరెస్ట్ అయిన వారిలో 61 మందిని రూ. 10 వేల పూచీకత్తుపై కోర్టు విడుదల చేసింది. మరో 9 మందికి మాత్రం ఈ నెల 28 వరకు రిమాండ్ విధించింది.
ఈ నేపథ్యంలో విశాఖలో జనసేన నేతల అక్రమ అరెస్ట్ లపై టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అరెస్టులను ఖండిస్తున్నామని అన్నారు. జగన్ కు జైలు జీవితానికి అలవాటుపడి…అందరినీ జైలుకు పంపాలనుకుంటున్నారని ఆయన ఫైర్ అయ్యారు. అందుకే ఇతర పార్టీల నేతలపై అక్రమ కేసులను బనాయిస్తున్నారని వెలగూడి అన్నారు. పవన్ కల్యాణ్ పట్ల పోలీసుల తీరు సరిగా లేదని అన్నారు.
వైసీపీ విశాఖ గర్జన తుస్సుమందని, పవన్ విశాఖలో అడుగుపెట్టిన వెంటనే విశాఖ గర్జన గాల్లో కలిసిపోయిందని వెలగపూడి అన్నారు. ఆ అక్కసుతోనే జనసేన నేతలపై అక్రమ కేసులు పెట్టారని, పోలీసులు హుందాగా వ్యవహరించడం లేదని ఆరోపించారు. ప్రభుత్వాలు మారుతాయనే విషయాన్ని కొందరు అధికారులు గుర్తు పెట్టుకోవాలని వెలగపూడి హితవు పలికారు.