మెగాస్టార్.. కేంద్ర మాజీ మంత్రి చిరంజీవికి.. ఏపీ సీఎం జగన్ రాజ్యసభ టికెట్ ఆఫర్ చేశారా? ఆయనను రాజ్యసభకు పంపిస్తానని హామీ ఇచ్చారా? ఔననే అంటున్నాయి.. తాడేపల్లి వర్గాలు. తాజాగా ఏపీలో నెలకొన్న సినిమా టికెట్ల వ్యవహారంపై.. పెద్ద ఎత్తున అటు టాలీవుడ్‌కు, ఇటు ఏపీ సర్కారుకు మధ్య తీవ్ర వివాదాలుకొనసాగుతున్నాయి.
ఇప్పటికే ఎంతో మంది చర్చకు వచ్చారు. మరికొందరు ట్విట్టర్ వేదికగా.. వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే అనూహ్యంగా చిరంజీవి తెరమీదికి వచ్చారు. వాస్తవానికి ఆయన సినిమా పెద్దరికాన్ని తాను తీసుకోనని.. వ్యక్తిగత విషయాలపై తాను స్పందించేది లేదని.. స్పష్టం చేశారు.
ఇది జరిగిన కొన్ని వారాల్లోనే అనూహ్యంగా.. ఇండస్ట్రీ నుంచి ఎవరూ వెళ్లి.. చిరంజీవితో మొర పెట్టుకోకుండానే.. ఏపీలో సినిమా టికెట్ల ధరలు తగ్గింపు.. హాళ్లపై అధికారుల దాడులు.. మూసివేతలు.. ఎగ్జిబిటర్ల, ధియేటర్ యాజమాన్యాల ఆందోళనలపై సీఎం చర్చించేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ నుంచి హుటాహుటిన (ఆయన బయలు దేరే వరకు కూడా ఈ విషయం బయటకు పొక్కలేదు.) తాడేపల్లికి వచ్చి.. సీఎంతో లంచ్ కూడా చేశారు.
ఈ క్రమంలో సినిమాలపై చర్చించామని.. త్వరలోనే సమస్యలు పరిష్కారం అవుతాయని.. చిరంజీవి చెప్పుకొచ్చారు. అయితే.. ఇది తెరపై కనిపిస్తున్న సినిమా అయితే.. తెరవెనుక సినిమా వేరే ఉందని.. తాజాగా వెలుగు చూసింది. సీఎం ఆహ్వానం మేరకే తాను వచ్చానని చెప్పిన చిరంజీవి.. మాటలను బట్టి..సినిమా సంగతులపై అయితే.. ఇప్పటి వరకు సీఎం ఎందుకు ఆయనను ఆహ్వానించలేదు. పై.గా.. చిరునే ఎందుకు ఆహ్వానించాలి. ఇంకా చాలా మంది హీరోలు ఉన్నారు కదా.. వారిని ఎందుకు పిలవలేదు… అనే కోణాల్లో ఆలోచిస్తే.. సంచలన విషయంపై అందరికీ ఇప్పుడు గురి కుదిరింది.
త్వరలోనే ఖాళీ అయ్యే రాజ్యసభ స్థానాల్లో ఒకటి చిరంజీవికి జగన్ ఆఫర్ చేశారని.. తాడేపల్లి వర్గాలు.. చెప్పుకొచ్చాయి. ఈ విషయం కోసమే.. సీఎం జగన్ చిరును స్వయంగా ఆహ్వానించారు. సినిమా సంగతుల కంటే కూడా ఈ విషయంపై నే ఇరువురు ఎక్కువగా చర్చించుకున్నారని అంటున్నారు.
వాస్తవానికి వచ్చే నెల ఫిబ్రవరిలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఏపీలో ఖాళీ అవుతున్నాయి. వీటిలో ఒకటి చిరుకు ఇవ్వడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందే అవకాశం జగన్‌కు భారీగా కనిపిస్తోంది. చిరు సోదరుడు పవన్‌ను నిలువరించడంతో పాటు.. కాపు సామాజిక వర్గం సహా టాలీవుడ్ మద్దతును జగన్ పొందే ఛాన్స్ స్ఫష్టంగా కనిపిస్తోంది. అందుకే ఈ వ్యూహం పన్ని ఉంటారని అంటున్నారు పరిశీలకులు.