తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక జాక్పాట్ సీఎం అంటూ వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రోజా వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత, సినీ నిర్మాత బండ్ల గణేష్ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా రోజాపై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రోజా ఒక ఐటెం రాణి అని, రోజా మాదిరి చేపల పులుసు పెడితే ఇక్కడ పదవులు రావని షాకింగ్ కామెంట్లు చేశారు. రోజా ఒక డైమండ్ రాణి అని, ఆమె పని చేస్తున్న పార్టీ నాయకుడు యాక్సిడెంటల్ సీఎం అని రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ సీఎం కాదని చెప్పుకొచ్చారు.
తండ్రి చనిపోతేనో, వారసత్వంగానో రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి రాలేదని బండ్ల అన్నారు. రేవంత్ ఒక డైనమిక్ లీడర్ అని, పోరాడి ముఖ్యమంత్రి అయ్యారని చెప్పారు. దేశ చరిత్రలోనే ఈ రకంగా పోరాడి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని ప్రశంసించారు. త్వరలోనే రోజా మాజీ కాబోతున్నారని, ఆ తర్వాత పగటిపుట జబర్దస్త్ షూటింగ్ చేసుకోవడం, రాత్రిపూట చేపల పులుసు వండి పెట్టడం మాత్రమే మిగిలి ఉందని హాట్ కామెంట్స్ చేశారు.
మరోవైపు, రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్న కేటీఆర్ పై కూడా బండ్ల గణేష్ విరుచుకుపడ్డారు. కేటీఆర్ మానసిక క్షోభలో ఉన్నారని, పగవాడికి కూడా అలాంటి పరిస్థితి రాకూడదని చెప్పుకొచ్చారు. కేటీఆర్ చుట్టూ ఇగో వైఫై మాదిరిగా ఉంటుందని, రాబోయే ఎన్నికల్లో ఏదో సాధిస్తామన్న భ్రమలో ఆయన ఉన్నారని చురకలంటించారు. భవిష్యత్తులో కేటీఆర్ కు మరిన్ని కష్టాలు తప్పవని బండ్లన్న జోస్యం చెప్పారు. లోక్ సభ బరిలో దిగే 17 మంది బీఆర్ఎస్ అభ్యర్థులు ఎవరో కేటీఆర్ చెప్పాలని బండ్ల డిమాండ్ చేశారు. కేసీఆర్ కొడుకు అనే ట్యాగ్ తప్ప కేటీఆర్ కి మరో గుర్తింపు లేదని అన్నారు. ఇక, ఫోన్ రింగ్ అయినా కేటీఆర్ భయపడుతున్నారని విమర్శించారు.
వాస్తవానికి, సీఎం జగన్, సీఎం కేసీఆర్ లు గతంలో రోజా వండిన చేపల పులుసు తిని కృష్ణా జలాల పంపకాల గురించి మాట్లాడుకున్నారని, ఆ తర్వాతే తెలంగాణ నీళ్ల వాటాను రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేసీఆర్ ఇచ్చారని రేవంత్ విమర్శించారు. దానికి స్పందనంగా రేవంత్ కి ఏం మాట్లాడాలో తెలియక అటువంటి కామెంట్ చేశారని రోజా మండిపడ్డారు. జగన్ తన ఇంటికి ఎప్పుడు వచ్చారో చెప్పాలని రోజా నిలదీశారు. రేవంత్ జాక్ పాట్ సీఎం అని ఎద్దేవా చేశారు. దీంతో, రోజా కామెంట్లపై బండ్ల గణేష్ స్పందించారు. మరి, బండ్ల గణేష్ వ్యాఖ్యలపై రోజా, కేటీఆర్ ల స్పందన ఏవిధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.