వైసీపీ అధినేత ఒక్క ఛాన్స్ అంటూ.. అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయ్యాయి. 2019, మే 30న ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేశారు.
అప్పటి నుంచి రాష్ట్రంలో ప్రజల దశ-దిశ మారుతుందని ప్రచారం చేసుకున్న జగన్ అండ్ కో పాలనలో మేళ్ల మాట ఎలా ఉన్నా.. విస్తృత ప్రజా ప్రయోజనాలకు మాత్రం భంగం కలిగిందనేది విశ్లేషకుల మాట. అధికారంలోకి వచ్చీ రావడంతో కృష్ణాకరకట్ట వెంబడి ఉన్న ప్రజావేదికను కూల్చి వేశారు.
పోనీ.. ఈ క్రమంలో నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మించిన వాటిని ఏవైనా కూలగొట్టారా? అంటే అది లేదు.
అంటే.. కేవలం టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుపై కసి తీర్చుకునేందుకు లేదా.. ఆయన పేరును తుడిచేసేందుకు మాత్రమే జగన్ వినియోగించుకున్నారని స్పష్టమవుతోందని అంటున్నారు పరిశీలకులు.
ఇక, అత్యంత కీలకమైన రాజధాని ప్రాజెక్టును కూడా లేకుండా చేసేందుకు ఈ రెండేళ్ల పాలనను జగన్ వినియోగించుకున్నారనే విమర్శలు వున్నాయి. అమరావతిని రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టుగా భావించిన నాటి సీఎం చంద్రబాబు.. దీనిని అభివృద్ధి చేయడం ద్వారా ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని భావించారు.
అయితే.. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జగన్ అమరావతిని అణిచి వేసే కుట్రకే ప్రాధాన్యం ఇచ్చారనే ది ఇక్కడి రైతులు, ప్రజల ఆందోళన. ఈ క్రమంలో తలెత్తిన ఉద్యమం.. నేటికీ కొనసాగుతూనే ఉంది.
ఇక, పోలవరం ప్రాజెక్టుకు అంచనాల పెంపు విషయంలోనూ చంద్రబాబు ప్రభుత్వంతో విభేదించిన జగన్.. అప్పట్లో అంచనాల పెంపునకు వ్యతిరేకంగా కేంద్రానికి లేఖలు రాశారు. తీరా అధికారంలోకి వచ్చాక.. అంచనాల పెంపు లేక పోతే.. ప్రాజెక్టు ముందుకు సాగదని గుర్తించారు.
కానీ, ఈ క్రమంలో గతంలో తాము రాసిన లేఖలే.. తమకు ప్రతిబంధకంగా మారుతాయని ఊహించకపోవ డం గమనార్హం. ఒక అడుగు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కి అన్నచందంగా పోలవరం పరిస్థితి మారిపోయింది.
ఇక, తాము ఫిరాయింపులను ప్రోత్సహించేది లేదంటూనే.. టీడీపీని ఇక్కట్లలోకి నెట్టేలా జగన్ వ్యవహరించిన తీరు అందరికీ తెలిసిందేనని అంటున్నారు విశ్లేషకులు.
టీడీపీ మాజీ మంత్రుల నుంచి సీనియర్ నాయకుల వరకు కేసులు పెట్టి జైళ్ల చుట్టూ తిప్పడం సహా మొత్తంగా చూస్తే.. జగన్ తన రెండేళ్ల పాలనలో ఎక్కువ సమయాన్ని టీడీపీని వేధించేందుకు, చంద్రబాబును రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించారనేది విశ్లేషకుల అభిప్రాయం. మరి వచ్చే మూడేళ్లయినా.. ఆయన ఈ వైఖరిని మార్చుకుంటారో లేదో చూడాలి.