జగన్ ను సీఎం చేయడంలో మాజీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అకా పీకే పాత్ర ఎంతో కీలకం అన్న సంగతి తెలిసిందే. అయితే, పీకే ప్రస్తుతం ఐ ప్యాక్ కు ప్యాకప్ చెప్పేసి తన సొంత రాష్ట్రం బీహార్ రాజకీయాలకు పరిమితమయ్యారు. కానీ, సమయం సందర్భం వచ్చినపుడు దేశ రాజకీయాలతోపాటు పలు రాష్ట్రాల రాజకీయాలపై పీకే ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఏపీలో జగన్ మరోసారి అధికారం చేపట్టడం చాలా కష్టం అంటూ పీకే చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
2019 ఎన్నికలకు ముందు జగన్ సీఎం అవుతారు అని బల్లగుద్ది చెప్పిన పీకే…2024 ఎన్నికలకు నెల రోజు ముందు అదే జగన్ సీఎం కావడం కష్టం అని కరాఖండిగా చెప్పేశారు. ఏదో ఫ్లోలో పీకే అలా చెప్పేయలేదు. జగన్ మళ్లీ ఎందుకు సీఎం అయ్యే అవకాశం లేదు అన్న విషయంపై తనదైన శైలిలో పీకే విశ్లేషణ చేశారు. రాష్ట్రాభివృద్ధికి ఊతమిచ్చేందుకు జగన్ ఏమీ చేయలేదని, ప్రజల ఆకాంక్షలను జగన్ నెరవేర్చలేదని పీకే అభిప్రాయపడ్డారు. గతంలో చక్రవర్తుల మాదిరి ఇప్పుడు జగన్ ప్రొవైడర్ మోడ్ లో ఉండిపోయారని, లీడర్ కాలేకపోయారని, గతంలో చక్రవర్తుల మాదిరిగా ప్రజలకు తాయిలాలు ఇచ్చి జగన్ సరిపెట్టారని అన్నారు.
ప్రజలకు ఏం కావాలో వారికంటే నాకు బాగా తెలుసు అని గతంలో చక్రవర్తులు అనుకునే మాదిరిగా ఇప్పుడు ఏపీ ప్రజలకు నగదు బదిలీ చేస్తే చాలు అని జగన్ అనుకుంటున్నారని అన్నారు. అప్పు చేసైనా సరే నగదను నేరుగా ప్రజల ఖాతాల్లో జమ చేస్తున్నామని, అదే వారికి మంచిది అని జగన్ భావిస్తున్నారని పీకే చెప్పారు. అయితే, రోడ్లు వేయడం, ఉద్యోగాలు కల్పించడం, ఫ్యాక్టరీలు, ఐటీ కంపెనీలు, సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేలా చేయడం వంటి అనేక విషయాల్లో జగన్ విఫలమయ్యారని అన్నారు. ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ లాగా జగన్ పని చేశారని అన్నారు.
ఇక, లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై కూడా పీకే కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో బీజేపీకి 300కు పైగా సీట్లు వస్తాయని పీకే అంచనా వేశారు. ఈసారి దక్షిణ భారతదేశంలో బీజేపీ ఓట్ల వాటా, సీట్ల సంఖ్య పెంచుకుంటుందని జోస్యం చెప్పారు. అయితే, బీజేపీ, ప్రధాని మోడీ అజేయులు కాదని, వారిని ఓడించేందుకు మూడు వాస్తవిక అవకాశాలు ఉన్నాయని అన్నారు. అయితే, సోమరితనం, తప్పుడు వ్యూహాల కారణంగా బీజేపీని ఓడించే అవకాశాన్ని ప్రతిపక్షాలు కోల్పోతున్నాయని పీకే విశ్లేషించారు.
ఇండియా కూటమికి ఒక అజెండ, ఒక వాదం, అన్ని పార్టీల ఉమ్మడి ఆమోదం పొందిన ఒక నాయకుడు లేరని, అదే వారి బలహీనత అని అన్నారు. ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్‌లలో ఎక్కవ సీట్లు వచ్చే అవకాశాలున్నాయని, కానీ, రాహుల్ గాంధీ మణిపుర్, మేఘాలయాల్లో పర్యటిస్తుంటే ఇండియా కూటమి ఎలా విజయం సాధిస్తుందని ప్రశ్నించారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ అనుకున్న ఫలితాలు రానప్పుడు సోనియా గాంధీలాగే రాహుల్ కూడా తప్పుకోవడంలో, కొంత బ్రేక్ తీసుకోవడంలో తప్పులేదని అన్నారు.