తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో ఏపీలో రాజకీయం అంతకంతకూ వేడుక్కుతోంది. విమర్శలు.. ప్రతి విమర్శలు.. ఆరోపణలు.. ప్రత్యారోపణలతో రాజకీయ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాజాగా జరుగుతున్న ఉప ఎన్నికల్లో గెలుపు అవకాశాలు ఎక్కువగా అధికార వైసీపీ అభ్యర్థికే ఉన్నట్లు చెబుతున్నారు. మరోవైపు.. బీజేపీ.. టీడీపీ అభ్యర్థులు తిరుపతి ఎన్నికల్లో గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ మాత్రం ఉనికి కోసం పోరాడుతోంది. ఆ పార్టీ తరఫున అభ్యర్థిగా మాజీ కేంద్రమంత్రిగా చింతా మోహన్ బరిలో ఉన్నారు.
తిరుపతి ఎంపీ అన్నంతనే గుర్తుకు వచ్చే ఆయన.. గతంలో పలుమార్లు తిరుపతి ఎంపీగా గెలుపొందారు. విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా వ్యతిరేకించిన ఏపీ ప్రజల పుణ్యమా అని.. ఇప్పుడా పార్టీ అడ్రస్ గల్లంతైంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ ప్రభుత్వం ఏ క్షణంలో అయినా కూలిపోవచ్చంటూ కొత్త బాంబ్ పేల్చారు. జగన్ ఇంకా సీఎంగా కొనసాగుతున్నారంటే.. అది కేవలం కోర్టుల్లోని జడ్జిల దయాదాక్షిణ్యాల వల్లేనని వ్యాఖ్యానించారు. అవినీతి సొమ్ముతో.. దొంగ నోట్లు పంచి.. దొంగ ఓట్లు వేయించుకునేందుకు అధికార వైసీపీ ప్లాన్ చేసినట్లు చెప్పారు. ఎన్నికల నిబంధనల కంటే 20 రెట్లు ఎక్కువగా ఇప్పటివరకు ఖర్చు చేసినట్లు ఆరోపింరారు. ఇప్పటివరకు జగన్ సర్కారు కూలిపోతుందని చెప్పినా.. ఈ తరహాలో వ్యాఖ్యలు చేయలేదన్న మాట వినిపిస్తోంది. చింతా మోహన్ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.