తన సోదరి వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి, ప్రియల నిశ్చితార్థ వేడుకకు ఏపీ సీఎం జగన్ సతీసమేతంగా హాజరయ్యారు. హైదరాబాద్ గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్ లో ఘనంగా జరిగిన ఈ వేడుకకు వచ్చిన జగన్, భారతిలకు షర్మిల ఆత్మీయ స్వాగతం పలికారు. తన మేనల్లుడు రాజారెడ్డిని జగన్ ఆప్యాయంగా హత్తుకున్నారు. రాజారెడ్డికి, ప్రియలకు జగన్, భారతి శుభాకాంక్షలు తెలిపారు. తన తల్లి విజయమ్మతో జగన్ ముచ్చటించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ అగ్రనేత వైవీ సుబ్బారెడ్డి కూడా హాజరయ్యారు.
ఈ నిశ్చితార్థ వేడుకకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారు. రాజారెడ్డి, ప్రియలకు పవన్ శుభాకాంక్షలు తెలియజేశారు. షర్మిల, బ్రదర్ అనిల్, రాజారెడ్డి, ప్రియతో కలిసి పవన్ ఫొటోలు దిగారు. ఈ వేడుకకు జగన్ హాజరవుతారా లేదా అన్న ఉత్కంఠకు తెర దించుతూ జగన్ సతీసమేతంగా విచ్చేయడం విశేషం. ఈ క్రమంలోనే సోదరి షర్మిలతో జగన్ కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బంధుత్వం వేరు రాజకీయం వేరని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.