జిల్లాకో విమానాశ్రయమట!!
పాత ప్రతిపాదనలన్నీ తమవేనని ప్రచారం
తిరుపతి, మధురవాడ, గన్నవరం పనులూ నాటివే
అశోక్ చేతిలో విమానయానంతో చకచకా విస్తరణ
కడప నుంచి నాలుగు నగరాలకు నాడు సర్వీసులు
ఇప్పుడు ఇండిగోతో డీల్ కుదుర్చుకుని కుదింపు
తాను తప్ప విమానం ఎవరూ ఎక్కకూడదనుకున్నారో ఏమో.. జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే.. నవ్యాంధ్ర నుంచి విదేశాలకు, స్వదేశంలోని నగరాలకు విమాన సర్వీసులు ఆపేశారు. చంద్రబాబు హయాంలో నేరుగా సింగపూర్ వెళ్లినవారు.. హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు ఎయిర్‌పోర్టులకు వెళ్లి ఎక్కాల్సిన పరిస్థితి కల్పించారు. రాష్ట్రంలో విమానాశ్రయాలన్నీ దాదాపు ఖాళీగా పడిఉన్నాయి.
రెండున్నరేళ్ల తర్వాత జగన్ మాటలు వింటే విస్తుగొల్పుతున్నాయి. ఉట్టికెక్కలేనమ్మ.. స్వర్గానికి ఎగురుతానన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నారు. ‘జిల్లాకో ఎయిర్‌పోర్టు ఉండాలి.. బోయింగ్ విమానం దిగేలా రన్వేలు అభివృద్ధి చేయాలి..’ అని అంటున్నారు.
నిజానికి ఇవన్నీ గతంలో వేసిన ప్రణాళికలే. అప్పటి ప్రణాళికలను మళ్లీ చెప్పడం తప్ప చేతల్లో చూపకపోవడం ఆయన స్పెషాలిటీ. రాష్ట్రంలో 14 విమానాశ్రయాలు ఉండాలని అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వ ప్రణాళిక వేసింది. దానిలో భాగంగా కడప, కర్నూలు విమానాశ్రయాల నిర్మాణ పనులను పూర్తిచేసింది.
గన్నవరం, తిరుపతి విమానాశ్రయాల విస్తరణ పనులు చేపట్టింది. తిరుపతిలో కొత్త టెర్మినల్ నిర్మించారు. ఆకాశం నుంచి చూస్తే గరుడ పక్షిలా ఉండేలా ఈ టెర్మినల్ భవనాన్ని అద్భుతంగా నిర్మించారు. రాష్ట్ర ప్రభుత్వం భూమి సమకూరిస్తే..కేంద్రం నిధులతో ఈ పనులు పూర్తిచేశారు.
గన్నవరం విమానాశ్రయం నుంచి తొలిసారి నేరుగా విదేశానికి విమానం ఎగిరింది టీడీపీ ప్రభుత్వంలోనే! అయితే జగన్ సర్కారు వచ్చాక ఒక్కో విమానాశ్రయం రెక్క తెగుతూ పోయింది. గన్నవరం నుంచి సింగపూర్‌కు గత ప్రభుత్వంలో ఎగిరిన విమాన సర్వీసు రద్దైంది. వాస్తవానికి ఈ సర్వీసు విజయవంతంగా నడిచింది. సింగపూర్ నుంచి తొలిసారి గన్నవరం విమానాశ్రయంలో దిగిన విమానంలో ఒక్క సీటు కూడా ఖాళీలేకుండా నిండిపోయాయి. అలాంటి సర్వీసును ఈ ప్రభుత్వం వచ్చాక రద్దు చేసింది.
అదేవిధంగా కడప నుంచి కేంద్ర ప్రభుత్వ పథకం ఉడాన్ కింద నాలుగు నగరాలకు విమాన సర్వీసులు ఏర్పాటుచేశారు. విజయవాడ, చెన్నై, బెల్గాం, హైదరాబాద్‌లకు ట్రూజెట్ విమానాలు నడి చేవి. ప్రతిరోజు వందల సంఖ్యలో ఇక్కడి నుంచి ఆయా నగరాలకు వెళ్లేవారు. కడప జిల్లా నుంచి అరబ్ దేశాలకు వెళ్లేవారి సంఖ్య ఎక్కువ. వీరంతా కడప నుంచి చెన్నైకు వెళ్లి అక్కడి నుంచి ఆరబ్ దేశాలకు వెళ్లేవారు.
ఈ సర్వీసులు కూడా గత కొంతకాలం నుంచి ఆగిపోయాయి. అసలిప్పుడు కడప విమానాశ్రయం నుంచి విమానాలే ఎగరడం లేదు. ఇటీవల జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో కడప, కర్నూలు నుంచి మళ్లీ విమానాలు నడిపేందుకు ఇండిగోతో ఒప్పందం చేసుకునేందుకు ఆమోదముద్ర వేశారు. అది కూడా కడప నుంచి గతంలోలా నాలుగు నగరాలకు కాకుండా రెండు నగరాలకే సర్వీసులు తిరిగేలా ఏర్పాటుచేశారు.
భోగాపురం, గన్నవరం కార్గో.. నాటి ప్రణాళికే
రాష్ట్రంలో జిల్లాకో విమానాశ్రయం ఉండాలంటూ గత ప్రభుత్వ హయాంలో ప్రణాళిక వేయడమే కాదు.. దాని అమలులో ముందుకెళ్లి కొన్నింటిని పూర్తిచేశారు. టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు మోదీ ప్రభుత్వంలో పౌర విమానయాన మంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర సహకారంతో ఈ ప్రణాళికను ముందుకుతీసుకెళ్లారు.
కర్నూలుకు సమీపంలోని ఓర్వకల్లు వద్ద విమానాశ్రయం ఏర్పాటుచేశారు. దానికి సంబంఽధించిన పనులన్నీ దాదాపు గత ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయి. కడపలో విమానాశ్రయ టెర్మినల్, ఇతర పనులను పూర్తిచేసి అక్కడి నుంచి విమానాలు నడిచేలా ఏర్పాట్లుచేశారు. రాజమహేంద్రవరం సమీపంలోని మధురపూడి విమానాశ్రయం కూడా అభివృద్ది చేశారు.
గన్నవరం విమానాశ్రయ అభివృద్ధికి అవసరమైన భూసేకరణను నాటి ప్రభుత్వమే పూర్తి చేసింది. ప్రతిగా భూములిచ్చిన రైతులు రాజధాని అమరావతిలో తమకు ప్లాట్లు ఇవ్వాలని అడిగితే ఆ పనిచేసి…భూసమీకరణ ప్రక్రియను విజయవంతంగా చేసింది. భోగాపురం విమానాశ్రయానికి ప్రణాళిక కూడా అప్పటిదే.
జగన్ ప్రభుత్వం వచ్చాక ఆ విమానాశ్రయానికి ఇచ్చిన భూమిలో 500 ఎకరాలను వెనక్కితీసుకుంది. గత ప్రభుత్వం జీఎంఆర్‌ని ఎంపికచేయగా ఈ ప్రభుత్వమూ అదే సంస్థకు బాధ్యతను అప్పగించింది. అయితే ఆశించినంత వేగంగా పనులు జరగడం లేదనే విమర్శలున్నాయి.
గత ప్రభుత్వం రూపొందించినా, అంతకుముందు ప్రభుత్వాలు రూపొందించినా.. ఆయా ప్రణాళికలను ముందుకు తీసుకెళ్లడంలో తప్పులేదు. అది నిరంతర ప్రక్రియ. కానీ కొత్తగా ఏమీ చేయకుండా.. పాత ప్రణాళికలను తనవిగా చెప్పడం జగన్ ప్రభుత్వానికి అలవాటుగా మారింది. ఓ పక్క చిన్న రోడ్డు వేయడానికి కూడా కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. బిల్లులు ఇవ్వకపోవడమే దీనికి కారణం. ఎంత బతిమాలినా వారు పనులు తీసుకోవడానికి ససేమిరా అంటున్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లాకో విమానాశ్రయం కట్టేయాలనడం హాస్యాస్పదం.