ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మైక్ అందుకున్నారంటే తనకంటే నిబద్ధత కలిగిన నాయకుడు మరొకరు లేరన్నట్లే మాట్లాడతారు. మాట తప్పను, మడమ తిప్పను.. అబద్ధాలు ఆడను అంటూ ఘనంగా ప్రకటనలు చేస్తారాయన. కానీ ప్రత్యేక హోదా, పోలవరం, సీపీఎస్ సహా వివిధ అంశాల్లో 2019 ఎన్నికలకు ముందు చెప్పిన ఎన్నో మాటలు తర్వాత మారిపోయాయి. ఎన్నో హామీలు అటకెక్కేశాయి.
ఇక ఆయన వేదికల మీద అలవోకగా అబద్ధాలు కూడా ఆడేస్తుంటారు. తాజాగా గుంటూరు జిల్లాలో సోమవారం జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో ఆయన నోట ఒక పచ్చి అబద్ధం వచ్చేసింది. రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలకు సంబంధించి తాము కోర్టుల్లో అన్ని కేసులూ గెలిచేశామని జగన్ ఘనంగా ప్రకటించేశారు. హైకోర్టులో, సుప్రీం కోర్టులో అన్ని కేసులూ గెలిచిన తర్వాత ఇళ్ల స్థలాల పంపిణీ జరిగిందని జగన్ చెప్పడం పచ్చి అబద్ధమే.
కొన్ని నెలల కిందటే పట్టుబట్టి అమరావతి ప్రాంతంలో వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చింది జగన్ సర్కారు. ఐతే చంద్రబాబు ప్రభుత్వం రాజధాని కోసం రైతుల నుంచి భూములు సేకరించి.. సీఆర్డీఏ చట్టం చేసిన ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇవ్వడం అన్యాయం అని.. కేవలం మాస్టర్ ప్లాన్ను చెడగొట్టడానికి.. భూములిచ్చిన రైతులను దెబ్బ కొట్టడానికే ఇళ్ల స్థలాల పంపిణీ అంటూ బాధితులు కోర్టుకు ఎక్కారు. ఆ కేసులు ఎటూ తేలకముందే హడావుడిగా ఇళ్ల స్థలాల పంపిణీ జరిగింది.
కానీ లబ్ధిదారులకు ఇచ్చిన పట్టాల్లోనే ఆ స్థలాల మీద యాజమాన్య హక్కు ఇప్పుడే రాదని.. కోర్టు కేసులు క్లియర్ అయ్యాకే స్థలం సొంతం అవుతుందని పేర్కొనడం గమనార్హం. ఈ కేసులో కోర్టులో పెండింగ్లో ఉండటంతో ఇళ్ల నిర్మాణం కూడా ఇప్పుడు సాధ్యపడేలా లేదు. ఇదంతా జనాలకు కూడా తెలిసినా కూడా వారిని మభ్య పెడుతూ కోర్టుల్లో కేసులు గెలిచి మరీ ఇళ్ల స్థలాల పంపిణీ చేశామని ముఖ్యమంత్రి స్థాయి ప్రకటన చేయడం విడ్డూరం.