వైసీపీ తరఫున నరసాపురం నుంచి గెలిచిన రఘురామరాజు కొంతకాలంగా జగన్ కి తలనొప్పిగా మారిన విషయం తెలిసిందే. అయితే, ఈరోజు ఆయనకే షాక్ తగిలే న్యూస్ ఒకటి వచ్చింది. ఢిల్లీలో కూర్చుని రచ్చబండ సమావేశాలతో ఏపీ సర్కారును ప్రజల తరఫున నిలదీస్తున్న రఘురామరాజు ఇల్లు ఆఫీసులపై ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. ఢిల్లీకి చెందిన ఐటీ బృందం ఏడు ప్రాంతాల్లోని ఆయన ఆస్తులపై ఏకకాలంలో సోదాలు నిర్వహించింది.
ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులు ప్రత్యేక బృందాలుగా విడిపోయి ఈ సోదాలు నిర్వహించారు. ఎంపీ రఘురామకృష్ణంరాజుకు చెందిన హైదరాబాద్ నివాసంతో పాటు పలు చోట్ల సోదాలు జరిపారు. ఇందు, భారత్ కంపెనీలతో సహా బంధువుల ఇల్లను కూడా సోదా చేశారు. ఇందు, భారత్ తో పాటు ఆయన కంపెనీల డైరెక్టర్ల ఇళ్లను కూడా తనిఖీ చేస్తున్నారు. అలాగే ఢిల్లీ నివాసంలో కూడా సోదాలు జరుగుతున్నాయి. మొత్తం 8 సంస్థలు రఘురామరాజు పేరు మీదుండగా, మొత్తం 12 కంపెనీలను ఆయన నడుపుతున్నారు. దాదాపు అన్నింటిలోను సోదాలు జరుగుతున్నాయి.
ఐటీ సోదాల వల్ల రఘురామరాజు ప్రతిరోజు పెట్టే రచ్చబండ కార్యక్రమం ఈరోజు జరగలేదు. మరి రేపు కూడా జరుగుతుందో లేదో తెలియని పరిస్థితి. ఈ ఘటన రఘురామరాజు ప్రత్యర్థులకు మంచి అవకాశంలా కనిపించింది. కేంద్రంతో మంచి సంబంధాలుంటాయి ఆయనకు అనుకుంటున్న సమయంలో ఈ సోదాలు జరగడం విచిత్రమే. మరి దీని అప్ డేట్ ఏంటో రఘురామరాజే చెప్పాలి.