గత ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా గుడివాడలో క్యాసినో వ్యవహారం జాతీయ స్థాయిలో పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. మాజీ మంత్రి కొడాలి నాని తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని గుడివాడలో గోవా కల్చర్ తెచ్చారని టీడీపీ నేతలు మండిపడ్డారు. ఇక, నానికి చెందిన ఎన్ కన్వెన్షన్ లో క్యాసినోతోపాటు పోకర్ వంటి జూద క్రీడలు నిర్వహించారని, వాటిపై నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు టీడీపీ ఆధ్వర్యంలో నిజనిర్ధారణ కమిటీ కూడా ఏర్పాటైంది. కొడాలి నాని, వంశీలపై ఈడీ, సీబీడీటీ, డీఆర్ఐ, కేంద్ర ఆర్థిక, హోం శాఖలకు కూడా టీడీపీ ఫిర్యాదు చేసింది.
అయితే, తమ గుట్టు రట్టవుతుందన్న కారణంతో ఆ కమిటీని వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. టీడీపీ నేతలు బొండా ఉమతోపాటు మరికొందరిపైనా దాడి చేశాయి. అయినప్పటికీ భయపడకుండా ఆనాడు గుడివాడలో జరిగిన పరిణామాల నివేదికను ఏపీ గవర్నర్ విశ్వ భూషణ్ హరిచందన్ కు టీడీపీ నిజనిర్ధారణ కమిటీ అందజేసింది. క్యాసినోకు సంబంధించిన కరపత్రాలు, వీడియోలు, ఫొటోలు, ఆధారాలను గవర్నర్కు సమర్పించారు. ఆనాడు గవర్నర్ను కలిసిన వారిలో వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, బోండా ఉమా, ఆలపాటి రాజా తదితరులు ఉన్నారు.
ఈ క్రమంలోనే తాజాగా గుడివాడ క్యాసినో వ్యవహారంపై టీడీపీ చేస్తున్న పోరాటం ఫలించింది. గుడివాడలో క్యాసినో వ్యవహారంపై ఐటీ శాఖ ఫోకస్ పెట్టింది. ఈ క్యాసినో వ్యవహారంపై ముందు నుంచి పోరాడుతున్న టీడీపీ నేత వర్ల రామయ్యకు ఐటీ శాఖ నోటీసులు పంపింది. వర్ల వద్ద ఉన్న సమాచారాన్ని తమకు అందజేయాలని సూచించింది. దీంతో, ఈ నెల 19న విజయవాడలో ఐటీ శాఖ అధికారులను వర్ల కలవనున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా, ఈసారి సంక్రాంతికి కూడా గుడివాడలో క్యాసినో పెట్టి కోట్లు దండుకోవాలని చూసినవారికి తాజాగా ఐటీ శాఖ షాకిచ్చిందని చెప్పవచ్చు.