ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో తాను వైసీపీ తరఫున ఓడిపోవడమే మంచిదైందని అన్నారు. లేకపోతే.. ప్రస్తుతం తాను ప్రజల మధ్య ఇంత ధైర్యంగా తలెత్తుకుని తిరిగి ఉండేవాడిని కాదని వ్యాఖ్యానించారు. దేవుడి దయ వల్ల ఓడిపోవడమే తనకు మంచిదైందని దగ్గుబాటి అన్నారు. “ఆరోజు నిజంగా మీరు గెలిపించి ఉంటే.. నా పరిస్థితి ఏమిటి ఈ రోజు? తలెత్తుకు తిరగ గలిగే వాడినా? నా మంచికోరి ఆ భగవంతుడు అలా చేశాడు“ అని దగ్గుబాటి వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు.
నేడు రాజకీయాలంటే బూతులు తిట్టుకోవడమేనని, పరస్పరం రోడ్డెక్కి నోరు పారేసుకోవడమేనని దగ్గుబాటి అన్నారు. దానికి ఎదురు జవాబులు ఇచ్చుకోవడం తప్ప ఒరిగిందేమీ లేదని వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. సోమవారం కారంచేడులో పలు గ్రామాలకు చెందిన ప్రజలను తన ఇంటికి ఆహ్వానించి.. క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో దగ్గుబాటి మాట్లాడారు. బీజేపీ అధికారంలో లేనప్పుడే పురందేశ్వరి ఆ పార్టీలో చేరారని తెలిపారు. ఆమె ఎప్పుడూ ప్రజల కోసం ఆలోచించే నాయకురాలని చెప్పారు. ఆమెపై చేసే విమర్శలకు తాను స్పందించబోనన్నారు.
‘‘కారంచేడులో రోడ్లు వేయలేదని గ్రామస్తులు చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే ప్రస్తుత పరిస్తితుల్లో ఈ రోడ్ల మీద ఇంత స్వేచ్ఛగా తిరగగలిగే వాడిని కాదు. భగవంతుడి దయవల్ల పర్చూరు నియోజకవర్గంలో నేను ఓడిపోవడం మంచిదైంది. ఓడిపోయిన రెండు నెలలకి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నన్ను పిలిచి నా కుమారుడికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తానని చెప్పారు. అయితే.. వీటి కోసం జగన్ పెట్టిన నిబంధనలను నన్నుఇబ్బంది పెట్టాయి. దీంతో వైసీపీలో ఇమడలేమని నిర్ణయించుకున్నాం. అందుకే బయటకు వచ్చాం’’ అని దగ్గుబాటి అన్నారు.