ఏపీలోని జగన్ సర్కారుకు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న పీకే (ప్రశాంత్ కిశోర్)కు చెందిన ఐప్యాక్ సంస్థ తాజాగా సర్వే నిర్వహించింది. దీనికి సంబంధించిన నివేదిక ఒకటి తాజాగా సోషల్ మీడియాలో లీక్ .. సంచలనంగా మారింది. అయితే.. ఈ నివేదిక నిజమైనదేనా? అన్న సందేహాన్ని వ్యక్తం చేస్తున్నప్పటికీ.. లీకైన రిపోర్టు మీద ఐప్యాక్ సంస్థకు చెందిన వాటర్ మార్కు స్పష్టంగా కనిపిస్తున్నందున.. ఇది అసలైన నివేదికే అన్నట్లుగా చెబుతున్నారు. ఇక.. నివేదికలోని వివరాలు రాజకీయ సంచలనంగా మారిందని చెబుతున్నారు.
తాజా సర్వేలో తేలిన కఠిన వాస్తవం ఏమంటే.. మొత్తం మంత్రుల్లో ఐదుగురు మాత్రమే గెలిచే వీలుందని.. ఇక.. మాజీలుగా మార్చిన మంత్రుల్లోకేవలం ఇద్దరికి మాత్రమే గెలుపు అవకాశాలు ఉన్నట్లుగా తేల్చారు.
ఈ రిపోర్టులోని అంశాలు అధికార వైసీపీకి చెందిన నేతలకు వణుకు పుట్టేలా మారాయి. రాష్ట్రంలో మంత్రులుగా ఉన్న పాతిక మందిలో.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గెలుపు అవకాశాలు ఉన్నవి కేవలం ఐదుగురికి మాత్రమే అని పేర్కొన్నారు.
అదే విధంగా మంత్రులుగా పదవీ ప్రమాణస్వీకారం చేసిన రెండున్నరేళ్లకు మంత్రులుగా ఉన్న వారిని తొలగిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం కారణంగా మాజీలుగా మారిన పదమూడు మందిలో కేవలం ఇద్దరు మాత్రమే ఎన్నికల్లో విజయం సాధించే వీలుందన్న మాట వినిపిస్తోంది. జగన్ కేబినెట్ లో విజయం సాధించే వీలున్న ఐదుగురు మంత్రుల్లో ముగ్గురు రాయలసీమకు చెందిన వారు కాగా.. మరో ఇద్దరు గోదావరి జిల్లాలకు చెందిన వారు.
ఇంతకీ ఆ ఐదుగురు ఎవరంటే..
1. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (పుంగనూరు)
2. అంజాద్ బాషా (కడప)
3. నారాయణ స్వామి (గంగాధర నెల్లూరు
4. పినిపె విశ్వరూప్ (అమలాపురం)
5. దాడిశెట్టి రాజా (రామలింగేశ్వరరావు) (తుని)
అదే సమయంలో మాజీ విషయానికి వస్తే.. ఇద్దరు మాత్రమే గెలుపు అవకాశాలు ఉన్నాయి. మాజీల్లో మళ్లీ గెలిచే అవకాశాలు ఉన్న ఇద్దరిలో ఒకరు ధర్మాన క్రిష్ణదాస్ అయితే.. మరొకరు కొడాలి నానిగా చెబుతున్నారు. మంత్రుల్లో గెలుపు అవకాశాలు ఉన్న ఐదుగురిలో కూడా అంజాద్ బాషాకు మాత్రమే పదివేల మెజార్టీ వచ్చే వీలుందని.. మిగిలిన నలుగురు ఐదు వేల లోపు మెజార్టీలోనే విజయం సాధిస్తారని చెబుతున్నారు.
అయితే.. ఈ ఐదుగురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో బలమైన ప్రత్యర్థులు లేకపోవటం వారికి లాభిస్తోందని చెబుతున్నారు. మంత్రులుగా మళ్లీ గెలిచే వారిలో పినిపె విశ్వరూప్ పేరు ఉండటం ఆసక్తికరంగా మారింది. అమలాపురం జిల్లా పేరు మార్పు వేళ.. అక్కడ చోటు చేసుకున్న హింస.. ఆందోళనకారులు మంత్రి ఇంటిని తగలబెట్టేయటం తెలిసిందే.
అయినప్పటికీ.. ఆయనకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు నివేదిక చెబుతోంది. గడిచిన కొంతకాలంగా అనారోగ్యంగా ఉన్న విశ్వరూప్ జనాల్లోకి కూడా పెద్దగా రావటం లేదు. తిరగటం లేదు. అయినప్పటికీ ఆయన గెలిచే అవకాశం ఎక్కువగా ఉండటం విశేషంగా చెప్పాలి.
పాతిక మంది మంత్రుల్లో ఐదుగురు మినహా మిగిలిన మంత్రులకు ఓటమి ఖాయమని సర్వే రిపోర్టు స్పష్టం చేస్తోంది. ఈ ఇరవై మంది ఎవరన్నది చూస్తే..
– బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
– బొత్స సత్యనారాయణ
– ధర్మాన ప్రసాదరావు
– పీడిక రాజన్న దొర
– బూడి ముత్యాల నాయుడు
– రోజా
– కొట్టు సత్యనారాయణ
– ఆదిమూలపు సురేశ్
– గుడివాడ అమర్నాథ్
– కారుమూరి నాగేశ్వరరావు
– జోగి రమేశ్
– విడదల రజిని
– చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ
– గుమ్మనూరి జయరాం
– కాకాణి గోవర్ధన రెడ్డి
– మేరుగు నాగార్జున
– అంబటి రాంబాబు
– తానేటి వనిత
– సీదిరి అప్పలరాజు
– ఉషశ్రీ చరణ్
మంత్రులుగా వెలిగిపోతున్న వారిలో ఓడిపోవటం ఖాయమని చెబుతున్న ఈ నివేదికలోని పేర్లు చూసినప్పుడు.. గత ఎన్నికల్లో భారీ మెజార్టీని సొంతం చేసుకున్న వారు ఉండటం షాకింగ్ గా మారింది. ఉదాహరణకు గుమ్మనూరు జయరాం విషయానికే వస్తే గత ఎన్నికల్లో ఆయనకు ఏకంగా నలభై వేల ఓట్ల మెజార్టీ వచ్చింది. అలాంటి ఆయన తాజాగా నిర్వహించిన సర్వేలో మాత్రం ఓడిపోవటం ఖాయమని చెబుతున్నారు.
ప్రభుత్వ వ్యతిరేకత ఎంత ఉందన్న విషయం తాజా రిపోర్టు స్పష్టం చేస్తుందంటున్నారు. ఇక.. మంత్రులుగా వ్యవహరిస్తూ సీఎం జగన్ కారణంగా మాజీలుగా మారిన వారిలో ధర్మాన.. కొడాలి నాని తప్పించి ఇంకెవరూ ఎమ్మెల్యేలుగా గెలిచే పరిస్థితి లేదని నివేదిక పేర్కొంది. మొత్తంగా ఐప్యాక్ సర్వే రిపోర్టుగా వైరల్ అవుతున్న ఈ నివేదికను చేసిన వైసీపీ నేతల నోటి నుంచి మాట రావటం లేని పరిస్థితి. మరి.. దీనిపై వైసీపీ నేతలు ఎవరైనా రియాక్టు అవుతారా? అన్నది ప్రశ్నగా మారింది. మరేం జరుగుతుందో చూడాలి.