కూటికోసం..కూలికోసం.. అన్నట్టుగా ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నతస్థాయిని చేరుకోవాలని కలలుగన్న తెలంగాణలోని మౌలాలి ప్రాంతానికి చెందిన మైనారిటీ వర్గానికి చెందిన యువతి అగ్రరాజ్యం బాటపట్టింది. అక్కడ ఉన్నత విద్యను అభ్యసించి.. భారత్‌కు తిరిగి వచ్చి.. తన కుటుంబాన్ని పోషించుకుని, ఉన్నతస్థాయికి తీసుకురావాలని భావించింది. వెళ్లడం వరకు అయితే.. బాగానే జరిగింది. కానీ, అక్కడకు వెళ్లిన తర్వాత.. ఆమె హఠాత్తుగా ఒత్తిడికి గురయ్యారు.
ఆ వెంటనే మానసిక ఆందోళన కప్పేసింది. ఫలితంగా ఇప్పుడురోడ్లపై తిండికోసం అలమటించే పరిస్థితిలో ఉన్నారు. ఇదే విషయాన్ని వెల్లడిస్తూ.. ఆ యువతి తల్లి కేంద్రానికి మొర పెట్టుకుంది. తన కుమార్తె పరిస్థితి అత్యంత దీనంగా ఉందని.. ఆదుకోవాలని ఆమె భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
ఏం జరిగింది?
హైదరాబాద్ శివారులోని మౌలాలికి చెందిన సయ్యదా లులు మిన్హాజ్ జైదీ ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లింది. అక్కడ మాస్టర్స్ డిగ్రీ చేయాలని కలలు కంది. ఈ క్రమంలో 2021 ఆగస్టులో అమెరికాకు వెళ్లారు. అక్కడికి వెళ్లిన ఆమె తరచూ తల్లి సయ్యదా వహాజ్ ఫాతిమాతో ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. కానీ.. రెండు నెలలుగా ఆమె స్పందించడం మానేసింది. దీంతో ఏదైనా జరిగి ఉంటుందని తల్లి అనుమానించింది. అయితే.. సమాచారం కోసం అనేక ప్రయత్నాలు చేసినా.. ఎవరూ స్పందించలేదు.
ఇటీవల హైదరాబాద్ నుంచి అమెరికాకు వెళ్లిన కొందరికి ఆ తల్లి మొర పెట్టుకుంది. దీంతో వారు గాలించి.. యువతిని గుర్తించి తల్లికి తెలియజేశారు. ఆమె వస్తువులను ఎవరో దొంగలించారని.. దీంతో ఆమె మానసికంగా కుంగిపోయి.. ప్రస్తుతం ఇబ్బంది పడుతున్నారని వారు సమాచారం అంతేకాదు.. అంతేకాదు, చికాగో రోడ్లపై ఆకలితో అలమటిస్తోందని తెలిపారు. అంతేకాకుండా లులు మిన్హాజ్ మానసిక ఒత్తిడికి లోనవుతున్నట్లు తెలిపారు.
దీంతో తల్లడిల్లిన తల్లి గుండె.. తన కుమార్తెను తిరిగి భారత్ తీసుకురావాలని కేంద్రమంత్రి ఎస్ . జైశంకర్‌కు లేఖ రాశారు. ‘‘నా కుమార్తె సయ్యదా లులు మిన్హాజ్ జైదీ అమెరికాకు మాస్టర్స్ చేసేందుకు వెళ్లింది. రెండు నెలలుగా ఆమె నాకు ఫోన్ చేయడం లేదు. హైదరాబాద్ నుంచి మాకు తెలిసిన కొందరు అమెరికాకు వెళ్లారు. చికాగోలో నా కుమార్తెను గుర్తించారు. ఆమె వస్తువులు చోరీకి గురయ్యాయి. ఆకలితో అలమటిస్తోంది. ఆమెను భారత్‌కు తీసుకురావాలని కోరుతున్నాను’’ అని లేఖలో పేర్కొంది. ప్రస్తుతం ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒకింత ఆవేదన కలిగిస్తుండడం గమనార్హం.