గతంలో ఎప్పుడూ జరగని వైనం ఈసారి అస్కార్ పురస్కారాల ప్రదానోత్సవం సందర్భంగా చోటు చేసుకోవటం తెలిసిందే. 94వ అస్కార్ వేడుకల సందర్భంగా వ్యాఖ్యాత క్రిస్ రాక్ మాట్లాడుతూ.. ఫన్నీ పేరుతో హాలీవుడ్ ప్రఖ్యాత నటుడు విల్ స్మిత్ సతీమణిపై చేసిన వ్యాఖ్యలకు ఆగ్రహం వ్యక్తం చేసే క్రమంలో వేదిక మీదకు వెళ్లి.. వ్యాఖ్యాత చెంప చెళ్లున పగలకొట్టటంతెలిసిందే. ఈ ఉదంతం పెను సంచలనంగా మారింది. ఇదే వేడుకలో అతడికి ఉత్తమ నటుడి అవార్డు రావటం.. దాన్ని అందుకోవటానికి వెళ్లిన సందర్భంగా క్షమాపణలు చెప్పటం తెలిసిందే.
విల్ స్మిత్ చెంపదెబ్బ ప్రపంచ వ్యాప్తంగా షాక్ కు గురయ్యేలా చేసింది. అనారోగ్యంతో ఉన్న తన భార్యపై వేరే వారు కామెంట్ చేసినప్పుడు ఆ మాత్రం రియాక్టు కావాలని కొందరు వాదిస్తే.. మరికొందరు విల్ స్మిత్ తీరును తీవ్రంగా తప్పు పట్టారు. ఈ వ్యవహారంపై అస్కార్ అవార్డుల్ని ప్రదానం చేసే మోషన్ పిక్చర్ అకాడమీ చర్యలు తీసుకునే ప్రక్రియకు తెర తీసింది. ఇందులో భాగంగా శుక్రవారం అకాడమీ బోర్డు సభ్యులు హాజరయ్యారు. అస్కార్ అవార్డు వేడుకల్లో విల్ స్మిత్ తీరును తప్పుపట్టారు.
2022 ఏప్రిల్ 8 నుంచి పదేళ్ల పాటు అకాడమీ ఈవెంట్లకు మాత్రమే కాదు వ్యక్తిగతంగా కానీ వర్చువల్ గా కానీ ఇతర ఈవెంట్లు.. ప్రోగ్రామ్ లకు హాజరు కాకుండా బ్యాన్ విధిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తాను కొట్టిన చెంప దెబ్బ వ్యవహారంపై పశ్చాతాపాన్ని వ్యక్తం చేసిన అతడు.. అకాడమీ సభ్యత్వానికి రాజీనామా చేయటం తెలిసిందే. ఇక.. అకాడమీ నిర్ణయాన్ని తాను గౌరవిస్తున్నట్లుగా పేర్కొన్నారు. చెంపదెబ్బ ఎపిసోడ్ భారీ శిక్షకే కారణమైందని చెప్పక తప్పదు.