2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ నేటి నుంచి భారత్ జోడో యాత్ర ప్రారంభించనున్నారు. ఈ యాత్ర ప్రారంభానికి ముందు తమిళనాడులోని శ్రీపెరంబదూర్‌లో ఉన్న మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ స్మారకం వద్ద తన తండ్రికి రాహుల్ నివాళులు అర్పించారు. ఈ యాత్రను కన్యాకుమారి నుంచి మొదలుబెట్టబోతున్నారు.
దేశమంతా పాదయాత్ర చేపట్టి ప్రజలకు పార్టీని మరింత చేరువ చేయాలన్న లక్ష్యంతో రాహుల్ ఈ యాత్ర చేపడుతున్నారు. విద్వేష, విభజన రాజకీయాలకు తన తండ్రి బలయ్యాడని, కానీ అటువంటి విద్వేష రాజకీయాలకు దేశాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేనని రాహుల్ అన్నారు. ద్వేషాన్ని ప్రేమ జయిస్తుందని, భయాన్ని ఆశ జయిస్తుందని, కలిసికట్టుగా మనం అన్నింటిలో విజయం సాధిస్తామని రాహుల్ ఆశాభావం వ్యక్తం చేశారు.
కన్యాకుమారిలో ప్రారంభం కానున్న భారత్ జోడో యాత్ర 150 రోజుల పాటు 3,570 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. రాహుల్ సహా ఈ యాత్రలో పాల్గొనే వారంతా ప్రత్యేక కంటెయినర్లలోనే బస చేస్తారు. ఈ యాత్ర కోసం అన్ని వసతులతో కూడిన 60 కంటెయినర్లను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా, రాహుల్ ఓ కంటెయినర్లో ఉంటారు. మిగతా యాత్రికులంతా ఇతర కంటెయినర్లలో బస చేయనున్నారు.
5 నెలల పాటు యాత్ర కొనసాగనుంది. అందుకోసం వాతావరణ మార్పులకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. 118 మంది శాశ్వత యాత్రికులుండే ఈ టూర్ లో రోజుకు 6-7 గంటల పాటు పాదయాత్ర కొనసాగుతుంది. ఉదయం ఓ బ్యాచ్ 7 గంటల నుంచి 10.30 వరకూ, సాయంత్రం మరో బ్యాచ్ 3.30 గంటల నుంచి 6.30 వరకూ పాదయాత్ర చేస్తారు. రోజుకు 22-23 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగిస్తారు.
తెలంగాణలో ‘భారత్ జోడో యాత్ర’కు రూట్ మ్యాప్ సిద్ధం అయింది. అక్టోబర్ 24వ తేదీ రాహుల్ పాదయాత్ర తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. మక్తల్ నియోజకవర్గ పరిధిలోని కృష్ణా బ్రిడ్జి గుండా ప్రవేశించి దేవరక్రద, మహబూబ్ నగర్, జడ్చర్ల, షాద్ నగర్, శంషాబాద్, ముత్తంగి, సంగారెడ్డి, జోగిపేట , శంకరం పేట, మద్నూర్ గుండా సాగుతోంది. రాహుల్ గాంధీ తెలంగాణలో 15 రోజుల పాటు 350 కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నారు.