ఓనం పండుగ కేరళ కొంప ముంచిందా? అవుననే అంటున్నాయి అధికారిక వర్గాలు. కేరళను చూస్తే థర్డ్ వేవ్ గ్యారంటీ అనిపించకమానదు.ఎందుకంటే దేశంలో నమోదైన కేసుల్లో 68 శాతం కేసులు ఒక్క కేరళలోనే నమోదయ్యాయి.
కరోనా మహమ్మారి విజృంభణ కాస్త తగ్గుతుందనుకుంటున్న సమయంలో కేరళ పరిస్థితి దేశానికి ఆందోళన కలిగిస్తోంది. పండగ వేడుకలతో కేరళలో జరిగిన కరోనా కల్లోలంతో పండుగలపై అన్ని రాష్ట్రాలను కేంద్రం అలెర్ట్ చేసింది.
కేరళ రాష్ట్రంలో గత 24 గంటల్లో 31 వేల కేసులు వచ్చాయి. దేశ మొత్తం మీద 46,164 కేసులు నమోదయ్యాయి. అంటే దేశంలో నమోదైనా కేసుల్లో కేరళలో ఒక్కటే 68 శాతం కేసులు నమోదయ్యాయి.
మూడు నెలల కేసులలో ఇదే అత్యధికం కావడం గమనార్హం.ఎర్నాకుళం, త్రిశ్సూర్ లో భారీగా కేసులు నమోదు అవుతున్నాయి. కేరళలో టెస్ట్ పాజిటివిటీ రేటు 19.03%, ఇది కూడా గత మూడు నెలల్లో అత్యధికం.
గత వారం జరుపుకున్న ఓనమ్ పండుగ వల్ల ఈ కేసుల పెరుగుదలకు కారణమని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఓనమ్ తర్వాత కేసులు పెరుగుతాయని ముందుగానే ఊహించామని, తగిన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ పండుగ సమయంలో ప్రజల తీరు కరోనా వ్యాప్తికి కారణమైందని ప్రభుత్వం చెబుతోంది.
అయితే, ఇపుడు కొత్త భయం ఏంటంటే… మునుపెన్నడూ లేనంత వేగంగా కేసులు వస్తున్నాయంటే వేగంగా వ్యాపించే కొత్త వేరియంట్ ఏదైనా ఇక్కడ పుట్టిందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లేకపోతే ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న కేరళలో ఈ స్థాయిలో కేసులు రావడం విస్మయకరం.
కేరళలో మరో సమస్య ఏంటంటే అక్కడ యాంటీ బాడీలు తక్కువగా ఉన్నాయట. జూలైలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నిర్వహించిన నాల్గవ రౌండ్ సర్వేలో యాంటీబాడీస్ జాతీయ స్థాయిలో 67. 7 % అని తేలితే రాష్ట్రంలో కేవలం 42.7 % మాత్రమే అని తేలిందట.