టాలీవుడ్ దిగ్గజ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ(80) మంగళవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. కార్డియాక్ అరెస్ట్ తో హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కృష్ణ ఈ రోజు తెల్లవారుజామున 4.09 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. కృష్ణ శరీరంలోని కీలక అవయవాలన్నీ ఫెయిల్ అయ్యాయని, ఆ అవయవాలు చికిత్సకు స్పందించడం లేదని వైద్యులు వెల్లడించారు. కృష్ణ మృతితో టాలీవుడ్, కృష్ణ అభిమానులు, ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా కృష్ణ పార్థివదేహాన్ని హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆసుపత్రి నుంచి నానక్ రామ్ గూడలోని ఆయన ఇంటికి తరలించారు. పార్థివ దేహం తరలిస్తుండగా సూపర్ స్టార్ కృష్ణ అమర్ రహే అంటూ ఆయన అభిమానులు ఆసుపత్రి వద్ద నినాదాలు చేశారు. కృష్ణ పార్థివదేహాన్ని ఆయన ఇంటి వద్ద కాసేపు ఉంచి సాయంత్రం గచ్చిబౌలి స్టేడియానికి అభిమానుల సందర్శనార్థం తరలించనున్నారు.
ఎల్లుండి గురువారం నాడు పంజాగుట్టలోని మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు వాస్తవానికి రేపే అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు భావించారు. అయితే, రేపు అష్టమి కావడంలో ఎల్లుండి అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ రోజు, రేపు ప్రజలు, అభిమానుల సందర్శనార్థం కృష్ణ పార్థివదేహాన్ని ఉంచనున్నారు. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది.