నడి వేసవి. అందునా ‘‘మే’’. భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరి అవుతూ.. బయటకు అడుగు పెట్టాలన్నా సంకోచపడే పరిస్థితి. అలాంటి వాతావరణం ఒక్కసారిగా మారటమే కాదు.. గడిచిన కొద్దిరోజులుగా వాతావరణ శాఖ అధికారులు చేస్తున్న హెచ్చరికలకు తగ్గట్లే.. ఆకాశం మేఘావ్రతం కావటం.. చల్లటిగాలులు వీస్తూ చినుకులు పడ్డాయి. అలా మొదలైన వాన.. కాసేపటికే తన ఉగ్రరూపాన్నిచూపింది. మంగళవారం సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో సికింద్రాబాద్ లో మొదలైన వర్షం కాసేపటికే నగరం మొత్తాన్ని ముబ్బు చీరతో కప్పేసింది.
ఒక్కసారిగా మారిన వాతావరణంతో హైదరాబాద్ ప్రజలు ఆనందానికి గురయ్యారు. అయితే.. ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. వడగళ్ల వాన.. జోరుగా వీచినగాలులతో పాటు.. భారీ వర్షానికి.. ఉరుములు.. మెరుపులతో ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి. గడిచిన కొన్ని రోజులుగా మండే ఎండలు తప్పించి.. వాన జాడ లేని వేళ.. అందుకు భిన్నంగా కురిసిన వానతో హైదరాబాద్ నగర జీవికి నరకం అంటే ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూపించింది తాజా వాన.
భారీ వర్షం కారణంగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోవటంతో పాటు.. డ్రైనేజీలు పొంగి పొర్లటం ఒక ఎత్తు అయితే.. భారీ గాలుల కారణంగా విద్యుత్ సరఫరాలో పెద్ద ఎత్తున అంతరాయం ఏర్పడింది. చెట్లు విరిగిపోవటం.. హోర్డింగ్ లు రోడ్ల మీద పడిపోవటం లాంటి పరిణామాలతో ట్రాఫిక్ మొత్తం అస్తవ్యస్తమైంది. దాని నుంచి తేరుకునే సరికి అర్థరాత్రి అయ్యింది. అధికార యంత్రాంగం సైతం సిద్ధంగా లేనట్లుగా.. చేష్టలుడిగినట్లుగా ఉండిపోయింది.. దీంతో.. ప్రజలు తీవ్ర ఇక్కట్ల పాలయ్యారు.
గంట ప్రయాణం కాస్తా మూడు గంటలకు పైగా సాగటం ఒక ఎత్తు అయితే.. ఆన్ లైన్ సర్వీసులు మొత్తం బంద్ అయ్యాయి. ఫుడ్ డెలివరీ యాప్ ల్లో బుక్ చేసుకునే వెసులుబాటు లేకుండా పోవటం.. ఓలా.. ఊబర్.. ర్యాపిడో లాంటి ఆన్ లైన్ ట్రాన్స్ పోర్టు సర్వీసులు అందుబాటులోకి రాకపోవటం.. డ్రైవర్లు సిద్ధంగా లేకపోవటంతో నగర జీవులకు చుక్కలు కనిపించాయి. ఆఫీసు నుంచి ఇంటికి చేరుకోవటం ఎంతో కష్టంగా మారింది. పలుచోట్ల ఇంటర్నెట్ బంద్ అయిన పరిస్థితి. మొత్తంగా.. నడి వేసవిలో కురిసిన ఒక్క వాన హైదరాబాద్ మహానగర ప్రజలకు చుక్కలు చూపించటమే కాదు.. మహానగర జీవితం ఎంత నరకప్రాయంగా ఉంటుందన్న విషయాన్ని మరోసారి రుజువు చేసిందని చెప్పాలి.