కృష్ణాజిల్లాలోని కూచిపూడిలో ఉన్న సంజీవని వైద్యాలయంలో ధన్వంతరి వార్డ్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ చేతుల మీదుగా ధన్వంతరి వార్డ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా మాట్లాడిన సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. విద్య, వైద్యం వ్యాపారంగా మారిన ఈ కాలంలో గ్రామీణ ప్రాంతంలో వైద్య సేవలు అందించాలి అన్న సంకల్పంతో సంజీవని వైద్యాలయం ఏర్పాటు చేయడం గొప్ప విషయమని ఆయన ప్రశంసించారు.
ఈ మారుమూల ప్రాంతంలో అనేక రకాల వైద్య సేవలు అందించడం అభినందనీయమన్నారు. ఇలా సేవలందించడంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతున్న కూచిభొట్ల ఆనంద్ గారిని సత్య కుమార్ అభినందించారు. ఆ ఆసుపత్రి ప్రారంభించిన సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఈ వైద్యాలయం కోసం రూ.10 కోట్లు మంజూరు చేస్తూ జీవో ఇచ్చారని చెప్పారు. అయితే, ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో ఆ జీవో నిలిచి పోయిందని అన్నారు.
ఇపుడు ఆ జీవో గురించి సీఎం చంద్రబాబుతో మాట్లాడతానని, హాస్పిటల్ టాక్స్ మినహాయింపు గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడతానని చెప్పారు. వ్యవస్థలు చేసే పనులు వ్యక్తులు చేసే సందర్భం ఇటువంటి ఆస్పత్రులు నిర్వహించడం అని, కూచిభొట్ల ఆనంద్ ను ఆదర్శంగా తీసుకొని ఎన్నారైలు ఇటువంటి కార్యక్రమాలు, ఆసుపత్రులు మరిన్ని నిర్మించాలని కోరారు. అటువంటి వారికి వైద్య ఆరోగ్య శాఖ తరపున, శాఖాపరమైన విషయాల్లో పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు.
ఈ ఆస్పత్రిలో ఏడు విభాగాల్లో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగా వైద్యం అందిస్తున్నామని, ఆ క్రమంలోనే నూతనంగా ధన్వంతరి వార్డ్ ద్వారా మరో 30 పడకలు అందుబాటులోకి తెచ్చామని సంజీవని వైద్యాలయం చైర్మన్ కూచిభొట్ల ఆనంద్ అన్నారు. ఈ ఉచిత వైద్య సేవలు ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి సభాద్యక్షులుగా పామర్రు శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా, ఆత్మీయ అతిథులుగా అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్, ఆర్టీవీ రవి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఈ వైద్యాలయం కోసం అంతా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని వారు చెప్పారు.
ఈ కార్యక్రమం సంజీవని వైద్యాలయ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ హనుమ కుమార్ పర్యవేక్షణలో జరిగింది. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా డీఎంహెచ్ వో గీతా బాయ్, ఆరోగ్య శాఖ సిబ్బంది, కూచిపూడి గ్రామ సర్పంచ్ కె. విజయలక్ష్మి గారు, సంజీవని హాస్పిటల్ వైద్య బృందం, సిబ్బంది, హాస్పిటల్ సలహా కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో స్థానికులు, ప్రజలు పాల్గొన్నారు.