సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తారు మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు. దివంగత మహానేత వైఎస్ హయాంలో ఒక వెలుగు వెలిగిన ఆయన.. ఆ తర్వాత పెద్దగా కనిపించలేదు. ఏడాది క్రితం కూడా ఒక్కసారిగా మీడియాలో పెద్ద ఎత్తున కనిపించిన ఆయన తర్వాత మళ్లీ పెద్దగా కనిపించలేదు. టీఆర్ఎస్ అధినేత.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసే గోనె.. తాజాగా మరోసారి అధికార పార్టీ మీదా.. ఆ పార్టీ నేతల మీదా షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.
టీఆర్ఎస్ పాలనలో ఎంపీటీసీలు మొదలుకొని ఎమ్మెల్యేలు.. మంత్రుల వరకు అవినీతి అడ్డూ అదుపు లేకుండా పోయిందన్నారు. అందుకే మావోయిస్టుల వార్నింగ్ లు మొదలైనట్లుగా పేర్కొన్నారు. టీఆర్ఎస్ నేతల అవినీతి అలానే కొనసాగితే రానున్న రోజుల్లో అన్నలు వస్తారని.. పది నిమిషాల్లో అందరినీ చంపేసి వెళ్లిపోతారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి.. మెడికల్ ఉద్యోగాల మాఫియాపై మావోలు సీరియస్ గా ఉన్నట్లు పేర్కొన్నారు. వారు దాడి చేయాలని డిసైడ్ అయితే పది నిమిషాల్లో పని పూర్తి చేసి బార్డర్ దాటేసి వెళ్లే వీలుందన్న ఆయన.. ‘మంత్రులు.. ఎమ్మెల్యేల అవినీతి అంతా ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలుసు. అయినా.. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఒక మంత్రి బావ రూ.8 కోట్ల ప్రాపర్టీని అక్రమించారు. అయినా.. అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు’ అంటూ ఫైర్ అయ్యారు.
ఈ వ్యాఖ్యలన్ని ఒక ఎత్తు అయితే.. ఆయన మరో అడుగు ముందుకేసి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై మరో షాకింగ్ వ్యాఖ్య చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరాచకాల్ని చూస్తే.. తనకే చంపాలనిపిస్తోందంటూ అనూహ్య వ్యాఖ్యల్ని చేశారు. ఇటీవల కాలంలో మరే రాజకీయ నేత చేయని రీతిలో చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ సంచలనంగా మారాయి.