రాజకీయాల్లో సున్నిత అంశాలపై స్పందించే సమయంలో సంయమనంతో వ్యవహరించడం ఎంతైనా అవసరం ఉంటుంది. అందులోనూ, మేధావులుగా గుర్తింపు పొందిన వారు తమ వ్యాఖ్యల విషయంలో మరింత జాగరుకులుగా ఉండాలి. ఒక్కోసారి ఈ బ్యాలెన్స్ తప్పితే కనుక… విమర్శలకు దారితీయడం, వివాదంగా మారడం అనేది జరిగిపోతుంటుంది. తాజాగా పవన్ కళ్యాణ్ స్టేట్ మెంట్ విషయంలో ఓ తెలంగాణ ప్రముఖుడు చేసిన వ్యాఖ్యలు ఇదే రీతిలోకి చేరాయి.
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత కొద్దికాలంగా సనాతన ధర్మం విషయంలో దూకుడుగానే ముందుకు వెళుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన తాజాగా తెలుగు రాష్ట్రాల్లో సనాతన ధర్మం పరిరక్షించే లక్ష్యంతో ఓ కీలక ప్రకటన చేశారు. ‘నరసింహ వారాహి గణం’ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ప్రకటించిన పవన్ కళ్యాణ్… సనాతన ధర్మం పరిరక్షణే ఈ నరసింహ వారాహి గణం లక్ష్యమని వెల్లడించారు. సనాతన ధర్మాన్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారు, సనాతన ధర్మాన్ని అగౌరవపరిచేవారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పవన్ హెచ్చరించారు. అయితే, దీనిపై తెలంగాణకు చెందిన రాజకీయ విశ్లేషకుడు, రిటైర్డ్ ప్రొఫెసర్, ప్రభుత్వ నియామకాల సంస్థ అయిన పూర్వపు TSPSC మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పవన్ కళ్యాణ్ ‘నరసింహ వారాహి గణం’ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ప్రకటించినట్లు ఓ నెటిజన్ చేసిన ట్వీట్ ను ఘంటా చక్రపాణి రీట్వీట్ చేస్తూ సెటైర్లు వేశారు. “ఏమై పోతాడో ఏమిటో? తమ్ముడు!!..” అంటూ పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. ఈ నర్మగర్భ ట్వీట్ సహజంగానే రాజకీయ రగడను రేకెత్తించింది. నరసింహ వారాహి గణం ఏర్పాటుపై సెటైర్లు విసిరడంతో పాటుగా పవన్‌ను ఇలానే వదిలేస్తే ఆవేశపూరితంగా, అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్న తీరు వల్ల ఏమైపోతారు అన్నట్లుగా ఘంటా చక్రపాణి ట్వీట్ ఉద్దేశం ఉందని జనసైనికులు మండిపడుతున్నారు. అయితే, ట్విస్ట్ ఇక్కడితో పూర్తవలేదు. ఏకంగా మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర వరకూ వెళ్లింది.
సహజంగానే, పవన్ ఫ్యాన్స్ ఘంటా చక్రపాణికి ఓ రేంజ్లో కౌంటర్లు ఇస్తున్నారు. “ఆయన ఏమి అవ్వడు కాని.. నువ్వు చేసినవి బయటకు వస్తే, నువ్వు, నీ బాస్ ఏమైపోతారో.. అంత పెద్ద రెస్పాన్సిబుల్ పొజిషన్ లో కూర్చొని, ఏం చేశావ్ రా నువ్వు…??? నీ పాపం పండింది.. చూస్తా ఉండు. విద్యార్థుల ఉసురు తగిలి పోతావ్..” అంటూ ఓ నెటిజెన్ విరుచుకుపడ్డారు. `కమ్యూనిస్టు ల కడుపు మంట అంత ఇంత కాదు` అంటూ మరొకరు కామెంట్ చేశారు. `నీకు నువ్వే పెద్ద మేధావిలా ఫీల్ అవ్వకు.. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో జరా.. ఒక్క మాట అంటే కుమిలి కుమిలి పోతావ్.. నీ ఏజ్ కీ కీ రెస్పెక్ట్ ఇచ్చి వదిలేస్తున్నాం..” అని మరో జనసైనికుడు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ల పరంపర అలానే కొనసాగుతోంది.`అంటూ ఇంకో నెటిజన్ ట్వీట్ చేశారు. మొత్తంగా… జనసేనాపై రియాక్టవుతున్న క్రమంలో… ఈ విమర్శల పర్వం తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు కనెక్ట్ అవడం ఆసక్తికరంగా మారింది.