టిడిపి అధినేత చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో ఆరోపణల పేరుతో ఏపీ సిఐడి పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అదే కేసులో టిడిపి ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును కూడా పోలీసులు విశాఖపట్నంలో అరెస్ట్ చేశారు. ఆయనతోపాటు ఆయన తనయుడు గంటా రవితేజను కూడా పోలీసులు విశాఖలోని ఆయన నివాసానికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు అరెస్టు, తన అరెస్టుపై గంట ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సంతోషం కోసమే చంద్రబాబును, తనను జగన్ అరెస్టు చేయించి ఆనందం పొందుతున్నారని ఆరోపించారు.
తన ప్రభుత్వం త్వరలోనే గద్దె దిగిపోతుందన్న ఫ్రస్ట్రేషన్ జగన్ లో ఉందని గంటా అన్నారు. చంద్రబాబు అరెస్టు దుర్మార్గమని, దేశ రాజకీయాలలో కీలక వ్యక్తిగా పేరున్న మాజీ ముఖ్యమంత్రిని ఈ రకంగా అరెస్ట్ చేయడం సరికాదని అన్నారు. ఏ విచారణకైనా సిద్ధమని ప్రకటించారు. కానీ, చంద్రబాబు వంటి సీనియర్ నేతను అర్ధరాత్రి పూట అరెస్టు పేరుతో భయభ్రాంతులకు గురి చేయడం ఏంటని ప్రశ్నించారు. తాను జైలుకు వెళ్లిన విధంగానే చంద్రబాబు సహా అందరిని జైలుకు పంపాలన్న కక్ష జగన్ లో కనిపిస్తోందని ఆరోపించారు. తనలాగే అందరిని జగన్ జైల్లో చూడాలనుకుంటున్నారని, అందుకే అక్రమ కేసులు బనాయించి ఇలా సంతోషిస్తున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో జగన్ కు డిపాజిట్లు కూడా దక్కవని జోస్యం చెప్పారు గంటా.
ఇక, ఈరోజు తెల్లవారుజామున విశాఖలోని గంటా నివాసానికి దిశ ఏసిపి వివేకానంద ఆధ్వర్యంలో వందలాదిమంది పోలీసులు వెళ్లారు. గంటాతో పాటు ఆయన తనయుడు రవితేజను కూడా దిశా పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా గంటా నివాసం వద్ద, పోలీస్ స్టేషన్ వద్ద భారీ సంఖ్యలో టిడిపి కార్యకర్తలు, గంటా అభిమానులు చేరుకొని పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.