టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా కింజరపు అచ్చెన్నాయుడు 2019 నుంచి కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. అయితే, అచ్చెన్నకు మంత్రివర్గంలో సీఎం చంద్రబాబు చోటు కల్పించడం, ఆయనకు వ్యవసాయ శాఖ, సహకార, మార్కెటింగ్ శాఖలను కేటాయించడం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీ టీడీపీ నూతన అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత పల్లా శ్రీనివాస్‌రావును చంద్రబాబు నియమించారు. మంత్రిగా బాధ్యతలు దక్కిన అచ్చెన్న టీడీపీ వ్యవహారాలపై పూర్తిస్ధాయిలో దృష్టి కేంద్రీకరించే అవకాశం లేనందున పల్లాను అచ్చెన్న స్థానంలో చంద్రబాబు నియమించారు.
ఈ క్రమంలోనే తన నియామకంపై పల్లా స్పందించారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా తనకు అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకు, మంత్రి నారా లోకేశ్ కు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులకు కృతజ్ఞతలు చెప్పారు. పార్టీ కష్టకాలంలో బాధ్యతలు సమర్థంగా నిర్వహించి పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిన అచ్చెన్నాయుడికి ధన్యవాదాలు తెలిపారు. తనను వెన్నుతట్టి నడిపిస్తున్న కార్యకర్తలకు, గాజువాక ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని పల్లా అన్నారు. గాజువాక ఎమ్మెల్యేగా 2024 ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో పల్లా శ్రీనివాస్ గెలుపొందిన సంగతి తెలిసిందే. గాజువాక వైసీపీ అభ్యర్థి, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్పై ఏకంగా 95, 235 ఓట్ట రికార్డు మెజారిటీతో పల్లా గెలిచారు.