సినీ నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ మళ్లీ సొంత గూటికే చేరనున్నారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. త్వరలోనే బాబు మోహన్ టీడీపీలో చేరబోతున్నారని అంటున్నారు. ఏపీలో అధికారం చేపట్టిన చంద్రబాబు.. ప్రస్తుతం తెలంగాణలో సైతం టీడీపీని బలోపేతం చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఇందులో భాగంగా ఆదివారం హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ముఖ్య నాయకులతో చంద్రబాబు సమావేశం అయ్యారు.
అయితే బాబు మోహన్ కూడా ఈ సమావేశానికి హాజరు అయ్యారు. ఇరువురి మధ్య ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలపై చర్చలు జరిగాయి. అలాగే టీడీపీలో చేరిక విషయం ప్రస్తావన.. బాబు మోహన్ ను మళ్లీ తమ పార్టీలోకి ఆహ్వానించేందుకు చంద్రబాబు సిద్ధమే అన్నట్లుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. దాంతో ఒక మంచి రోజు చూసుకుని బాబు మోహన్ టీడీపీలో చేరనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
కాగా, సీనియర్ ఎన్టీఆర్ గారిపై అభిమానంతో బాబు మోహన్ టీడీపీలో చేరి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1999 లో మెదక్ జిల్లాలోని ఆందోల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన బాబు మోహన్.. చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. 2004, 2009 లో జరిగిన ఎన్నికల్లో మునుపటి ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నరసింహ చేతిలో ఓడిపోయారు. 2014లో టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరారు.
అదే ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో దామోదర రాజ నరసింహను ఓడించి ఎమ్మెల్యేగా మళ్లీ గెలుపొందారు. 2018లో బీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోవడంతో బీజేపీలోకి జంప్ అయ్యారు. 2018, 2023 ఎన్నికల్లో ఓటమి పాలైన బాబు మోహన్.. బీజేపీకి గుడ్ బై చెప్పి ప్రజాశాంతి పార్టీలో చేరారు. ఇప్పుడు రాజకీయ భవిష్యత్తు కోసం మళ్లీ ఆయన తన సొంత గూటికే చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.