వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి కొడాలి నానీపై.. పోలీసులు కేసు కట్టారు. వైసీపీ అధికారం నుంచి దిగిపోయిన తర్వాత.. ఆ పార్టీ కీలక నాయకులపై నమోదైన తొలి కేసు ఇదే కావడం గమనార్హం. గుడివాడ 1వ పట్టణ పోలీసు స్టేషన్లో నమోదైన ఈ కేసు వివరాలను పోలీసులు వెల్లడించారు. అయితే.. ముందుగా 41 ఏ నోటీసులు ఇచ్చి.. కొడాలి నాని నుంచి వివరణ తీసుకుంటామని చెప్పడం గమనార్హం. గతంలో టీడీపీ నాయకులపై కేసులు పెట్టినప్పుడు.. ఇలా ఎవరినీ వివరణ కోరకుండానే అరెస్టు చేశారు.
కానీ ఇప్పుడు వైసీపీ నాయకులకు మాత్రం 41 ఏ కింద నోటీసులు ఇచ్చి.. వారి వివరణ తీసుకున్నాక చర్యలు చేపడతామని ఉన్నతాధికారులు చెప్పడం గమనార్హం. ఇదిలావుంటే.. కొడాలిపై ఫిర్యాదు చేసింది..నిన్న మొన్నటి వరకు ఆయనకు అనుకూలంగా ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసిన వలంటీర్లే కావడం గమనార్హం. ఎన్నికల సమయంలో కొడాలిని గెలిపించాలని.. ఆయన పేదలకు పెన్నిధి అని ప్రచారం చేశారు వలంటీర్లు. అయితే.. వారు ఊహించినట్టుగా కొడాలి విజయం దక్కించుకోలేక పోయారు.
దీంతో ఇప్పుడు పరిస్థితి యూటర్న్ తీసుకుంది. దీంతో వలంటీర్ ఉద్యోగాలకు ఎసరు వచ్చింది. దీనిని గమనించిన వలంటీర్లు టీడీపీ నేతలను ఆశ్రయించారు. తమ ఉద్యోగాలు కాపాడాలని విన్నవించారు. ఈ క్రమంలో.. “మిమ్మల్ని ఎవరైతే బలవంతంగా రాజీనామాలు చేయించారో.. వారిపై మీరు కేసులు పెట్టి వచ్చిన తర్వాత.. మమ్మల్ని కలవాలి“ అని కొందరు మంత్రులు సూచించారు. ఈ నేపథ్యంలోనే సుమారు 46 మంది వలంటీర్లు మూకుమ్మడిగా గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానిపై ఫిర్యాదు చేయడంతోపాటు.. కేసులు సైతం పెట్టారు. దీనిపై నాని రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.