వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ఒకటి ఆశిస్తే.. మరొకటి జరుగుతోంది. 2021లో చోటు చేసుకున్న మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఆయన.. బెయిల్ కోరుకున్నారు. అయితే.. ఈ పిటిషన్పై విచారణ హైకోర్టులో పెండింగులో పడింది. మరోవైపు.. ఆయనను పోలీసు కస్టడీకి అప్పగిస్తూ.. మంగళగిరి స్థానిక కోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయన మరిన్ని చిక్కుల్లో పడినట్టు అయింది.
టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో మూలాలను ఛేదించాల్సి ఉందని.. దీనిలో పాత్ర ధారులను గుర్తించినా.. సూత్ర ధారులను గుర్తించలేక పోయామని పోలీసులు చెబుతున్నారు. అంటే.. ఈ దాడి వెనుక.. ఎవరు ప్రోత్సహించారు. మాస్టర్ మైండ్ ఎవరు? అనే విషయాలను తేల్చాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తాము భౌతికంగా విచారణ చేసేందుకు ప్రస్తుతం గుంటూరు జైల్లో ఉన్న నందిగం సురేష్, విజయవాడ నగర డిప్యూటీ మేయర్ శైలజ భర్త అవుతు శ్రీనివాసరెడ్డిని కూడా విచారించాల్సిన అవసరం ఉందని పోలీసులు పిటిషన్ వేశారు.
ఈ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు ఇరు పక్షాల వాదలను విన్న తర్వాత.. మంగళగిరి కోర్టు ఇద్దరిని పోలీసు కస్టడీకి అప్పగించేందుకు ఆమోదం తెలిపింది. రెండు రోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య విచారణ చేయాలని.. ఎలాంటి లాఠీ చార్జీ చేయడానికి వీల్లేదని, దూషించరాదని, భయ పెట్టరాదని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ సందర్భంగా తమ న్యాయవాదులను కూడా విచారణకు అనుమతించాలన్న నందిగం తరఫు న్యాయవాది వాదనలను పరిగణనలోకి తీసుకుంది.
అయితే.. దీనికి సంబంధించి ప్రత్యేకంగా పిటిషన్ వేస్తే.. దానిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని కోర్టు వెల్లడించింది. దీంతో పోలీసులు ఇద్దరినీ విచారణకు తీసుకోనున్నారు. మరోవైపు.. వీరు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై హైకోర్టు నిర్ణయం వెలువరించాల్సి ఉంది. ఇదిలావుంటే.. నందిగం సురేశ్ ప్రకాశం బ్యారేజి గేట్లను బోట్లు ఢీకొట్టిన ఘటనలోనూ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. టీడీపీ ఆఫీసు కేసులో ఆయనకు బెయిల్ వచ్చినా.. ఈ కేసులో మరోసారి అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.