సీపీఎస్ రద్దుపై సీఎం జగన్ మాట తప్పినందుకు నిరసనగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు సెప్టెంబర్ 1వ తేదీన ‘మిలియన్ మార్చ్’ కి సిద్దమైన సంగతి తెలిసిందే. అయితే, ఆ మిలియన్ మార్చ్ కు అనుమతి లేదని, వారందరినీ హౌస్ అరెస్ట్ చేయించింది ప్రభుత్వం. అంతేకాదు, మరో దఫా చర్చలు జరుపుదామని మంత్రుల బృందం చెప్పడంతో పాటు, ప్రభుత్వం, పోలీసుల ఒత్తిడి చాలా ఎక్కువైపోవడంతో ‘మిలియన్ మార్చ్’ ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు వాయిదా వేసుకున్నాయి.
అయితే, నిరసన కార్యక్రమాన్ని విరమించుకున్నప్పటికీ కొందరు ఉద్యోగులపై జగన్ సర్కార్ కక్షగట్టింది. కొందరు ఉద్యోగులపై ఏపీ పోలీసులు బైండోవర్ కేసులు పెట్టారని ఏపీఎన్జీవో నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఏపీఎన్జీఓ ఉద్యోగ సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం ఇంటి ముట్టడిని విరమించినప్పటికీ ఉద్యోగులపై వేధింపులు, బెదిరింపులు, బైండోవర్లు సరికాదని వారు మండిపడుతున్నారు.
ఉద్యోగులపై పెట్టిన కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యకు నిరసనగా రేపు విద్రోహ దినంగా పాటించనున్నట్లు ప్రకటించారు. రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపబోతున్నట్లు వెల్లడించారు. సీపీఎస్ రద్దు చేసేదాకా తమ పోరాటం ఆగదని, సీఎం ఇచ్చిన హామీ నెరవేరేదాకా ఉద్యమాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు.
కాగా, జగన్ సర్కార్ పై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు మండిపడ్డారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులతో జగన్ చెలగాటమాడుతున్నారని, పోలీసులతో వారిని భయపెట్టి అణచివేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. వారిపై ఒత్తిడి చేసి తాత్కాలికంగా వారి ఉద్యమాలని అడ్డుకోగలరని, కానీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ కలిసికట్టుగా ముందుకు వస్తే ఎవరూ ఎదురునిలవలేరని వార్నింగ్ ఇచ్చారు. రాబోయే ఎన్నికలలో జగన్ కు 13.35 లక్షల మంది ఉద్యోగులు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం ఖాయం అని అన్నారు.