డీజే టిల్లు సినిమా తర్వాత సిద్ధు జొన్నలగడ్డ యూత్‌లో ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నాడో తెలిసిందే. ఐతే వేరే యంగ్ హీరో అయితే.. క్రేజ్ వచ్చింది కదా అని ఎడాపెడా సినిమాలు ఒప్పేసుకునేవాడేమో. కానీ అలా హడావుడి పడ్డ కొందరు యంగ్ హీరోలు ఎలాంటి పరిస్థితికి చేరారో ఉదాహరణలు కళ్ల ముందే కనిపిస్తున్నాయి. అందుకే సిద్ధు తొందరపడలేదు. ప్రేక్షకుల్లో తన మీద పెరిగిన నమ్మకానికి తగ్గట్లే సరైన సినిమా ఇవ్వాలని చూస్తున్నాడు.
అందుకే కొన్ని సినిమాలు ఒప్పుకుని కూడా వెనక్కి తగ్గాడు. ‘డీజే టిల్లు’ సీక్వెల్ మొదలుపెట్టి.. దాన్ని పెద్ద సినిమా రేంజికి తీసుకెళ్లడానికి కష్టపడుతున్నాడు. ఐతే ఈ సినిమా రిలీజ్ ఆలస్యం అవుతుండటం సిద్ధు అభిమానులకు అసహనం తెప్పిస్తోంది. ఇప్పటికే రిలీజ్ లేటైందని అనుకుంటుంటే.. ఇంకో మూడున్నర నెలలు ఎదురు చూడాల్సిందే అని ఈ రోజు తేల్చేశాడు.
వేలంటైన్స్ వీకెండ్లో భాగంగా 2024 ఫిబ్రవరి 11న ‘టిల్లు స్క్వేర్’ రిలీజ్ కాబోతున్నట్లు ప్రకటించాడు. మరీ అంత ఆలస్యం ఏంటి.. ఇదేమైనా అంత భారీ చిత్రమా అని కౌంటర్లు వేస్తున్న వాళ్లు లేకపోలేదు సోషల్ మీడియాలో. కానీ సిద్ధు పక్కా ప్లానింగ్‌తోనే ఈ డేట్ ఎంచుకున్నాడన్నది స్పష్టం. సినిమాను సిద్ధం చేయడం కంటే మంచి రిలీజ్ దక్కేలా చూసుకోవడం కీలకం. నవంబరులో సినిమాలకు అంతగా కలిసి రాదు. డిసెంబర్లో తీవ్రమైన పోటీ ఉంది. ఉన్న సినిమాలకే దిక్కు తోచని పరిస్థితి ఉంది.
ఇక జనవరిలో సంక్రాంతి టైంలో ఉండే పోటీ సంగతి తెలిసిందే. సంక్రాంతి తర్వాత రెండు మూడు వారాలు గ్యాప్ దొరుకుతుంది కానీ.. పండుగ సినిమాల హడావుడి తర్వాత ఒక రకమైన శూన్యత ఆవహిస్తుంది కాబట్టి అప్పుడు వచ్చే సినిమాలు సరిగా ఆడవు. అందుకే పోటీ లేకుండా.. వాలెంటైన్స్ డే వీకెండ్‌ను ఎంచుకున్నాడు. ఆ వీకెండ్ దాటాక డల్ సీజన్ మొదలవుతుంది. అది మిస్సయితే ఇక వేసవి వరకు ఎదురు చూడాలి. అందుకే అన్నీ ఆలోచించుకుని సోలోగా మంచి వీకెండ్ ఎంచుకున్నాడు సిద్ధు. కొత్త డేట్ అతడి పక్కా ప్లానింగ్‌ను సూచిస్తోంది.