ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సడెన్ గా సింగపూర్ పయనమవుతున్నారు. ఆయన చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదానికి గురయ్యాడు. సింగపూర్‌లోని ఓ స్కూల్ లో మార్క్ శంకర్ చదువుకుంటున్నాడు. అయితే తాజాగా ఆ స్కూల్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలు చెలరేగడంతో మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలు అయ్యాయి. అలాగే ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో తీవ్ర అస్వస్థతకు గురైన మార్క్ ను స్కూల్ సిబ్బంది ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం వైద్యులు మార్క్ కు చికిత్స అందిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్‌కు ఈ విషయం తెలియడంతో.. అధికారులు, నాయకులు పర్యటన నిలిపివేసి సింగపూర్ వెళ్లాలని సూచించారు. కానీ పవన్ అందుకు ఒప్పుకోలేదు. అరకు జిల్లాలో రెండు రోజుల పర్యటనను ముందే నిర్ణయించారు. పైగా అరకు సమీపంలోని కురిడి గ్రామం సందర్శిస్తానని ఆ గ్రామ గిరిజనులకు పవన్ మాట ఇచ్చారు.
ఇచ్చిన మాట ప్రకారం.. కురిడి గ్రామంలో పర్యటించి వారితో మాట్లాడి అక్కడి సమస్యలు తెలుసుకుంటానని అధికారులకు పవన్ స్పష్టం చేశారు. అదే విధంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభానికి ఏర్పాట్లు చేసినందున వాటిని పూర్తి చేసి విశాఖపట్నం చేరుకోనున్నారు. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి పవన్ కళ్యాణ్ సింగపూర్ లో ఉన్న తనయుడికి వద్దకు వెళ్లనున్నారు.